రివ్యూ : హ్యాపీ వెడ్డింగ్ – బోరింగ్ వెడ్డింగ్

స్టార్ కాస్ట్ : సుమంత్ అశ్విన్, నిహారిక, న‌రేష్, ముర‌ళి శ‌ర్మ‌ తదితరులు..
దర్శకత్వం : లక్ష్మణ్ కార్య
నిర్మాతలు: యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా
మ్యూజిక్ : శక్తికాంత్ కార్తిక్
విడుదల తేది : జులై 28, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

ల‌వ‌ర్‌, కేరింత లాంటి మంచి విజ‌యాల‌తో యూత్ ఆడియ‌న్స్ నే కాకుండా ఫ్యామిలి ఆడియ‌న్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్న సుమంత్ అశ్విన్ హీరోగా…. అచ్చ‌ తెలుగు చీర‌క‌ట్టు తో ప‌ద‌హ‌ర‌ణాల తెలుగు పిల్ల గా తెలుగు తెర‌కి పరిచమై ప్ర‌తి తెలుగు వారింటి ఆడ‌ప‌డుచులా త‌న ప్లెజెంట్ న‌ట‌న‌తో సుస్థిర‌ స్థానం సాధించుకున్న మెగాప్రిన్సెస్‌ నిహ‌రిక కొణిదెల హీరోయిన్ గా నటించిన చిత్రం హ్యాపీ వెడ్డింగ్.

ప్రతిష్టాత్మక యువి క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సినిమా వారు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య డైరెక్ట్ చేసాడు. ఫిదా ఫేమ్ శక్తికాంత్ మ్యూజిక్ అందించగా, ఆర్కెస్ట్రా రీ రికార్డింగ్‌ ఎస్‌.ఎస్‌.థ‌మ‌న్‌ అందించడం తో చిత్రం ఫై సినిమా ఇండస్ట్రీ లోనే కాక సినీ ప్రేక్షకుల్లో సైతం మంచి ఆసక్తి నెలకొనింది. విడుదలకు ముందే పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అందరి ఆసక్తి తగినట్లు సినిమా ఉందా..లేదా అనేది చూద్దాం.

కథ :

ఆనంద్‌ (సుమంత్ అశ్విన్‌), అక్షర (నిహారిక) ప్రేమించుకుంటారు. ఇద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరిస్తారు. కానీ పెళ్లి దగ్గర పడుతుందనగా.. ఆనంద్‌ను పెళ్లి చేసుకునే విషయంలో అక్షర కన్ఫ్యూజన్‌కు లోనవుతుంది. పెళ్లయిన తర్వాత తన స్వేచ్ఛ, ఇష్టాయిష్టాలకు దూరంగా ఉండాలేమోనన్న భయం ఆమెలో మొదలు అవుతుంది. తన పట్ల ఆనంద్‌ చిన్నపాటి అలసత్వం చూపించినా భరించలేకపోతుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ (రాజా చెంబోలు) రాకతో మరింత కన్ఫ్యూజన్‌కు వెళ్తుంది..ఈ కన్ఫ్యూజన్‌ లో అక్షర , ఆనంద్ ను పెళ్లి చేసుకుంటుందా..లేక విజయ్ ను చేసుకుంటుందా..? అక్షర కన్ఫ్యూజన్‌ నుండి బయటపడేందుకు తల్లిదండ్రులు ఏం చేశారనేది..మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* నిహారిక యాక్టింగ్

* డైలాగ్స్

* సినిమా ఫొటోగ్రఫీ

మైనస్ :

* సాగదీత సన్నివేశాలు

* కథ

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* కన్ఫ్యూజన్ అమ్మాయిగా నిహారిక అందంగా కనిపించింది. నటనలో ఇంకాస్త మెరుగుపడాలి.

* ఆనంద్‌గా సుమంత్ అశ్విన్ ఫర్వాలేదనిపించాడు. విజయ్‌గా రాజా చేబోలు పాత్ర కీలకమైనప్పటికీ గెస్ట్ రోల్ లాంటిదే.

* హీరోయిన్ తల్లిదండ్రులుగా తులసి శివమణి, మురళీ శర్మ నటించగా.. ఆనంద్ పేరెంట్స్‌గా పవిత్రా లోకేష్, నరేష్ నటించారు.

* వీరంతా తమ పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. కానీ మురళీ శర్మ, నరేష్‌లను డైరెక్టర్ పెద్దగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తుంది.

* హీరో నాన్నమ్మగా సీనియర్ నటి అన్నపూర్ణ డబుల్ మీనింగ్ డైలాగులతో కామెడీ పండించే ప్రయత్నం చేసింది.

* సెకలాజిస్ట్‌గా ఇంద్రజ కనిపించినప్పటికీ.. ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు.

సాంకేతిక విభాగం :

* ఫిదా ఫేమ్ శక్తికాంత్ అందించిన మ్యూజిక్ పర్వాలేదు. ఇక థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ సినిమాకు బాగా కలిసి వచ్చింది.

* బాల్ రెడ్డి సినిమా ఫొటోగ్రఫీ బాగుంది.

* యూవీ క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ లక్ష్మణ్ కార్య విషయానికి వస్తే ..పెళ్లి అనగానే అందరి అమ్మాయిల్లో అప్పటివరకు తల్లిదండ్రుల దగ్గర ఎంతో అల్లరిగా పెరిగి , పెళ్లి తర్వాత వారు ఎవరు తెలియదు..ఎలా ఉంటారో తెలియదు అలాంటి వారి దగ్గర ఎలా ఉండాలో..ఏం చేస్తే ఏమనుకుంటారో అనే భయం అందరిలో ఉంటుంది..ఆ భయాన్నీ డైరెక్టర్ ఈ కథ ద్వారా చెప్పాడు. కాకపోతే చాల సన్నివేశాలు సాగాతీసేసరికి ప్రేక్షకులకు బోర్ కొట్టింది. ప్రేమికుల మధ్య ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలు చూపించలేకపోయారు, కథనం కూడా సరిగా రాసుకోలేకయాడు. అక్కడక్కడా కాస్త నవ్వించాలని చూసాడు. కానీ అది కూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఓవరాల్ గా హ్యాపీ వెడ్డింగ్ ను బోర్ గా ఫీల్ అయ్యేలా చేసాడు.