రివ్యూ : జెర్సీ – ఎమోషనల్ క్రికెట్ డ్రామా

స్టార్ కాస్ట్ : నాని, శ్రద్ధా శ్రీనాథ్‌, సత్యరాజ్‌ తదితరులు..
దర్శకత్వం : గౌతమ్‌ తిన్ననూరి
నిర్మాతలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌
మ్యూజిక్ : అనిరుధ్‌
విడుదల తేది : ఏప్రిల్ 19, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : జెర్సీ – ఎమోషనల్ క్రికెట్ డ్రామా

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో తెరకెక్కిన స్పోర్ట్స్ నేపధ్య మూవీ జెర్సీ. గత ఏడాది రెండు ప్లాప్స్ తో అభిమానులను నిరాశ పరిచిన నాని..జెర్సీ మూవీ ఫై గట్టి నమ్మకాలే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో నాని క్రికెటర్ అర్జున్‌ (36)గా కనిపించాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నానికి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తమిళ సంచలనం అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. మరి ఈ సినిమా తో నాని ఎలాంటి హిట్ అందుకున్నాడు ..? మళ్లీ రావా తో ప్రసంశలు అందుకున్న గౌతమ్..జెర్సీ లో ఏం చెప్పదల్చుకున్నాడు..? అసలు ఈ చిత్ర కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

అర్జున్(నాని) మంచి క్రికెటర్.. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాథ్)ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ దాంపత్యానికి గుర్తుగా ఓ మగ బిడ్డ (నాని) పుడతాడు. అర్జున్ మంచి క్రికెటర్ అయినప్పటికీ జాతీయ జట్టులో స్థానం రాకపోవడంతో 26 ఏళ్ల వయసులోనే క్రికెట్ కి దూరం అవుతాడు. అలాగే స్పోర్ట్ కోటాలో వచ్చిన ఉద్యోగాన్ని సైతం వదిలేస్తాడు. ఇంట్లో ఖర్చులు పెరిగిపోయి ఉద్యోగం లేక భార్య జీతం మీద ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో నాని తన పుట్టిన రోజున అర్జున్‌ను జెర్సీ గిఫ్ట్‌గా అడుగుతాడు. ఐదొందల రూపాయల జెర్సీని కొనేందుకు అర్జున్.. సారా పర్స్ నుండి డబ్బులు దొంగతనం చేయబోతాడు. దీనిని చూసిన సారా..అర్జున్ తో గొడవ పడుతుంది.

ఈ క్రమంలో అర్జున్ కు కోచ్(సత్యరాజ్) కలుస్తాడు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మళ్లీ గ్రౌండ్ లో అడుగు పెట్టేందుకు సిద్ధం అవుతాడు. 36 ఏళ్ళు వచ్చిన వాడితో ఆట ఏంటి అనే హేళన ఎదురవుతుంది. అయినా భయపడకుండా అర్జున్ తన సత్తా చాటేందుకు సిద్ధ పడతాడు. భార్య నమ్మకాన్ని కోల్పోయినా కొడుకు కోసం లక్ష్యాన్ని ఎర్పరుచుకుంటాడు. అది అర్జున్ కు ఎలా సాధ్యమైనది అనేది కథ..

ప్లస్ :

* క్లైమాక్స్

* నాని నటన

* తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు

మైనస్ :

* స్లోనరేషన్‌

* ఎమోషనల్ డోస్ ఎక్కువగా ఉండడం

* చిత్ర నిడివి

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఈ చిత్రంలో సరికొత్త నాని ని చూస్తాం..ఇప్పటివరకు నాని ఇలాంటి రోల్ చేయలేదు. లవర్ బాయ్ గా..కమెడియన్ గా కనిపించిన నాని..ఈ సినిమాలో తండ్రి రోల్ చేసి అందర్నీ కంటతడి పెట్టించాడు. కొడుకు కోరిక ను తీర్చేందుకు కష్టపడే పాత్రలో ఎంతో చక్కగా ఒదిగిపోయాడు. సినిమా మొత్తం తన భుజాలపై వేసుకొని నిలబెట్టాడు.

ఎమోషనల్‌ సీన్లలో తను ఎంత బాగా నటించగలడో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఒక క్రికెటర్‌గా‌, ఒక ప్రేమికుడిగా ఎంత చక్కగా నటించాడో.. ఒక తండ్రి అంతే బాగా నటించాడు.

* నాని భార్య గా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ గ్లామర్ పరంగానే కాక నటనతోనే ఆకట్టుకుంది. కథలోని కీలక సన్నివేశాల్లో ఆమె హవాభావాలు బాగా పలికించింది.

* ఇక కోచ్‌గా, స్నేహితుడిగా నిత్యం అర్జున్‌ పక్కనే ఉండి నడిపించే సత్య రాజ్‌.. తన పాత్రకు న్యాయం చేశాడు.

* అర్జున్‌ తనయుడు నానిగా చేసిన బాలనటుడు ఎంతో చక్కగా నటించాడు.

* బ్రహ్మాజీ, సుబ్బరాజు, రాహుల్‌ రామకృష్ణ, సంపత్‌ రాజ్‌, ప్రవీణ్‌ తదితరులు వారి వారి పరిధిలో నటించి మెప్పించారు

సాంకేతిక విభాగం :

* తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ తన మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆకట్టుకున్నాడు. దాదాపు ప్రతి పాట కథలో భాగంగానే వినిపిస్తుంది.

* సాను వర్గీస్‌ సినిమా ఫొటోగ్రఫీ ఆకట్టుకుంది. సినిమా మొత్తం 1986, 96 నేపథ్యంలోనే జరగ్గా.. అప్పటి వాతావరణాన్ని సినిమాటోగ్రఫర్‌ చక్కగా చూపించారు.

* పీరియాడిక్‌ నేపథ్యంలో సాగినా ఈ సినిమాకు ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ పడిన కష్టం కూడా తెరపై కనిపిస్తుంది.

* ఎడిటింగ్‌ విషయానికి వస్తే..నవీన్ నూలి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. సినిమా బాగా స్లో గా సాగడం..నిడివి సైతం ఎక్కువ ఉండడం తో ప్రేక్షకులు కాస్త బోర్ గా ఫీల్ అయ్యారు.

* నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

ఇక డైరెక్టర్ గౌతమ్ విషయానికి వస్తే..తనకు కలిసి వచ్చిన స్క్రీన్‌ ప్లేతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కథలో భాగంగానే అక్కడక్కడా ఫ్లాష్‌ బ్యాక్‌ను రివీల్‌ చేస్తూ.. సినిమాను ముందుకు నడిపించాడు.

ప్రతి సినిమాలోనూ సినిమాటిక్‌ లిబర్టీస్‌ ఉంటాయి. ఉన్న దాన్ని మరింత గ్లామర్‌గా చూపించడానికి ప్రయత్నిస్తారు. కానీ, గౌతమ్‌ మాత్రం ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశాడు. జీవితంలో తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక, సంపాదనకు కూడా నోచుకోలేని ఓ క్రీడాకారుడి భావోద్వేగాలు ఎలా ఉంటాయో మనసుకు హత్తుకునేలా చూపించాడు. కేవలం రూ.500 పెట్టి జెర్సీ కొనిపెట్టడానికి ఓ తండ్రి పడే ఆవేదన, ప్రయత్నం ఫస్ట్ హాఫ్ లో చూపించాడు.

ఇక సెకండ్ హాఫ్ మొత్తం క్రికెట్‌ నేపథ్యంలో నడిపించాడు. పదేళ్ల క్రితం అర్జున్‌ ఏమైతే కోల్పోయాడో అవన్నీ అందుకునే దిశగా ప్రయత్నం మొదలు పెడతాడు. జాతీయ జట్టులో స్థానం కోసం అర్జున్‌ ఎంత కష్టపడతాడో తెరపై చూపించాడు. ఒక ఓడిపోయిన వ్యక్తి గెలిస్తే, ఎలా ఉంటుందో ఈ కథ కూడా అలానే ఉంటుంది. అయితే, తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌, పతాక సన్నివేశాలు ఇందులో అదనంగా కనిపిస్తాయి. క్లైమాక్స్‌ కంటతడి పెట్టిస్తుంది. ఓవరాల్ గా జెర్సీ ఓ ఎమోషనల్ క్రికెట్ డ్రామా.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review