రివ్యూ : మహర్షి

స్టార్ కాస్ట్ : మహేష్ బాబు , పూజా హగ్దే తదితరులు..
దర్శకత్వం : వంశీ పైడిపల్లి
నిర్మాతలు: పివిపి , దిల్ రాజు , అశ్విని దత్
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : మే 09, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ‘ మహర్షి ‘

మహేష్ కెరియర్‌లో 25 చిత్రంగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన మహర్షి చిత్రం ఈరోజు (మే 9) ప్రపంచ వ్యాప్తంగా సుమారు 2500 థియేటర్స్‌లో భారీ ఎత్తున విడుదల అయ్యింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆయన అభిమానులు గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తుండగా ఆ కోరిక ఈరోజు తో తీరింది. శ్రీమంతుడు చిత్రంలో గ్రామాన్ని దత్తత తీసుకున్న గొప్ప వ్యక్తి గా…భరత్ అను నేను లో పవర్ ఫుల్ ముఖ్య మంత్రి గా కనిపించిన మహేష్..మహర్షి లో మూడు విభిన్న పాత్రల్లో కనిపించాడు..స్టూడెంట్ గా …బిజినెస్ మాన్ గా…రైతు గా ఇలా మూడు పాత్రల్లో కనిపించాడు. మరి ఆ మూడు పాత్రల్లో ఎలా నటించాడు..? అసలు మహర్షి కథ ఏంటి..? రుషి కాస్త మహర్షి గా ఎందుకు మారాల్సి వచ్చిందనేది..పూర్తి కథ లో చూద్దాం.

కథ :

రిషి (మహేష్ బాబు) ఆరిజిన్‌ కంపెనీ సీఈఓ. ఓటమి అంటే తెలియని వ్యక్తి..అవతలవ్యక్తి ని భయపెట్టడమే కానీ జీవితంలో భయపడని వ్యక్తి రుషి. అలాంటి రుషి ప్రపంచంలోనే టాప్ బిజినెస్ మాన్ గా ఎదగడానికి కారణం తన ఫ్రెండ్స్ రవి (అల్లరి నరేష్‌), పూజ (పూజా హెగ్డే)లు. వారి వల్లే ఆ స్థాయికి రుషి చేరుకుంటాడు.

రుషి కి రవి గురించి కొన్ని విషయాలు తెలుస్తాయి.. దాంతో ఇండియాకు వస్తాడు..రుషి కి తెలిసిన ఆ విషయాలు ఏంటి..? అసలు రవి ఎవరు..అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? రవి కోసం రుషి మహర్షి ఎందుకు అవ్వాల్సి వస్తుంది..? వివేక్‌ మిట్టల్‌(జగపతి బాబు) కు రుషి కి సంబంధం ఏంటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* మహేష్ బాబు, అల్లరి నరేష్‌ నటన

* ఎమోషనల్ సీన్స్

మైనస్ :

* రన్ టైం

* సెకండ్ హాఫ్

* రొటీన్ క్లైమాక్స్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఈ సినిమాలో మహేష్ బాబు .. బిలీనియర్‌గా, స్టూడెంట్‌గా, రైతుగా మూడు విభిన్నపాత్రల్లో అద్భుతంగా నటించాడు. సీఈఓగా స్టైలిష్‌గా క‌నిపించిన మ‌హేష్ – విద్యార్థిగా మాస్‌ని అల‌రిస్తాడు. రైతు స‌మ‌స్య‌లపై పోరాటం చేస్తున్న‌ప్పుడు త‌న‌లోని సిన్సియారిటీ క‌నిపిస్తుంది. ఎమోషన్స్‌, యాక్షన్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు.

* కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసుకున్న హీరో అల్లరి నరేష్.. ఈ చిత్రంలో మహేష్, పూజా హెగ్డేలకు స్నేహితుడిగా కీలకపాత్రలో నటించాడు. ‘మహర్షి’ కథ ఈ పాత్ర చుట్టూనే అల్లాడు దర్శకుడు. , శంభోశివశంభో వంటి చిత్రాల్లో కీలకపాత్రల్లో నటించి మెప్పించిన నరేష్.. ‘మహర్షి’ చిత్రంలో నటించడం సినిమాకి మరో ప్లస్. ఇలాంటి పాత్ర‌ల‌కు ఇక‌పై న‌రేష్ పేరుని ప‌రిశీలించ‌డం ఖాయం.

* డీజే, అరవింద సమేత లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గోల్డెన్ లెగ్ గా మారిన పూజా హెగ్డే.. ‘మహర్షి’ చిత్రంలో మహేష్‌కి జోడీగా చక్కగా సరిపోయింది. అందం, అభినయంతో పాటు.. తన పాత్రతో బాగా ఆకట్టుకుంది.

* జ‌గ‌ప‌తిబాబు మ‌రోసారి స్టైలిష్ విల‌న్‌గా ఆక‌ట్టుకున్నారు.

* ఇతర పాత్రల్లో ప్రకాష్ రాజ్‌, జయసుధ, సాయి కుమార్‌, తనికెళ్ల భరణి, వెన్నెల కిశోర్‌ తదితరులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

* మహేష్ బాబు కు ‘1 నేనొక్కడినే’, ‘శ్రీమంతుడు’, ‘భరత్ అనే నేను’ లాంటి మ్యూజికల్ హిట్స్ ఇచ్చిన దేవి.. మరోసారి ‘మహర్షి’ చిత్రానికి పనిచేశారు. అయితే ఈ చిత్రంలోని ఆరు పాటలు అనుకున్నంత రేంజ్‌లో లేకపోయినప్పటికీ.. నాలుగు మాంటేజ్ సాంగ్స్ ఉండటాన్ని బట్టి కథానుగుణంగా దేవి శ్రీ ఈ పాటల్ని కంపోజ్ చేసాడు. శ్రీమణి సాహిత్యం పాటలకు బలాన్ని ఇచ్చింది. ఇక నేప‌థ్య సంగీతంలోనూ దేవి త‌న మార్క్‌ను చూపించారు.

* కేయు మోహనన్‌ సినిమాటోగ్రఫి సినిమాకు రిచ్‌ లుక్‌ తీసుకువచ్చింది. అమెరికా సీన్స్‌తో పాటు, గ్రామీణ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లోనూ కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటుంది.

* ఎడిటింగ్ విషయంలో చిత్ర యూనిట్ ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ సాఫీగానే సాగినప్పటికీ..సెకండ్ హాఫ్ బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపిస్తాయి. వాటిని తొలిగిస్తే నిడివి తగ్గేది.

* చిత్ర నిర్మాణం విషయానికి వస్తే మహేష్ 25 వ సినిమాగా తెరకెక్కడం తో నిర్మాణ విషయంలో చాల జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి ఫ్రేమూలోనూ ప్రేక్షకుడికి రిచ్‌నెస్‌ కనిపిస్తుంది. అందులో మహేష్‌ సినిమా కావడంతో ఖ‌ర్చు విష‌యంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు అవసరానికి మించి ఖర్చు చేశారు.

ఇక డైరెక్టర్ వంశీ పైడిపల్లి విషయానికి వస్తే..వంశీ పైడిపల్లి చేసినవి నాలుగే సినిమాలు అయినప్పటికీ స్టార్ దర్శకుల సరసన చోటు సంపాదించడానికి కారణం ఆయన దర్శకత్వం వహించిన ఊపిరి, ఎవడు, బృందావనం చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్లు కావడమే. తొలి చిత్రం మున్నాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. టేకింగ్ పరంగా ప్రశంసలు దక్కించుకున్నారు.

కెరియర్ స్టార్టింగ్‌లోనే ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పనిచేసిన వంశీ.. మహేష్‌తో పనిచేయడం కోసం రెండేళ్లు నిరీక్షించి.. ‘మహర్షి’ కథలో మహేష్‌ని మెప్పించి ఆయన్ని ఒప్పించి పట్టువదలని విక్రమార్కుడిలా ఈ సినిమాను చాల చక్కగా తెరకెక్కించారు. ఈయన ఎంచుకున్న క‌థ బ‌ల‌మైన‌దే. తాను అనుకున్న విధంగా తెరపై చూపించే ప్రయత్నం చేశారు. అందుకు మహేష్‌లాంటి అగ్రకథానాయకుడి ఎంచుకోవడం వల్లే ఈ కథకు మరింత బలం చేకూరింది. అయితే, నిడివి విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది. కొన్ని సన్నివేశాలకు కత్తెరవేస్తే, బాగుండేది.

ఇక క్లైమాక్స్ కూడా రొటీన్ గా ముగించేశాడు..నరేష్ – మహేష్ మధ్య ఇంకాస్త గట్టి సన్నివేశాలు రాసుకుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ బాగానే నడిపించిన..సెకండ్ హాఫ్ బాగా సాగదీసినట్లు అనిపించింది. సెకండ్ హాఫ్..నిడివి ..సంగీతం ..క్లైమాక్స్ వీటిల్లో వంశీ కాస్త తడబడ్డాడు. మిగతా అంత కూడా ఒకే.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review