రివ్యూ : మల్లేశం – సందేశాత్మక చిత్రం

స్టార్ కాస్ట్ : ప్రియదర్శి, ఝాన్సీ, చక్రపాణి, అనన్య తదితరులు..
దర్శకత్వం : రాజ్ ఆర్
నిర్మాతలు: రాజ్ ఆర్, శ్రీ అధికారి
మ్యూజిక్ : మార్క్ కె రాబిన్
విడుదల తేది : జూన్ 21, 2019

రివ్యూ : మల్లేశం – సందేశాత్మక చిత్రం

మల్లేశం..ఇది నిజ జీవిత కథ. నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన చింతకింది మల్లేశం కథే ఈ మల్లేశం. పెళ్లి చూపులు చిత్రంతో కమెడియన్ గా ప్రేక్షకులను నవ్వించిన ప్రియదర్శి..ఇప్పుడు చింతకింది మల్లేశం బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు హీరోగా వచ్చాడు. అసలు ఈ చింతకింది మల్లేశం ఎవరు..? ఆసు యంత్రాన్ని ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది..? ఈ ఆసు యంత్రం ఎలా పనిచేస్తుందనేది..? ఇప్పుడు చూద్దాం.

కథ :

చింతకింది మల్లేశం (ప్రియదర్శి) నిరుపేద చేనేత కుటుంబం. అమ్మ లక్ష్మి (ఝాన్సీ) చీరలు నేస్తుంది. ఒక చీరకు ఆసు పోయడానికి దారాన్ని పిన్నుల చుట్టు 9వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఇలా రోజుకి 18వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే గాని (25 కి.మీ) రెండు చీరలు తయారుకావు. దారాన్ని కండెల చుట్టూ తిప్పుతుంటే మల్లేశం తల్లి చేతులు లాగుతూ ఉండేవి. అమ్మ భుజం నొప్పితో రోజంతా బాధపడుతుంటే అమ్మ కష్టం గట్టేక్కేదెలా ఏదో ఒకటిచేయాలనుకున్నాడు.

చిన్నతనం నుంచే కొత్త విషయాల్ని కనుగొనడం పట్ల ఆసక్తిని ప్రదర్శించే మల్లేశం ఆసు యంత్రాన్ని తయారుచేయడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు. తనకొచ్చిన ఆలోచనను ఇరుగుపొరుగుతో పంచుకున్నాడు. వాళ్లు నిరుత్సాహపరచినా తన ఆశయం నెరవేర్చకోవడంకోసం ఊరిలో అప్పులు చేస్తాడు. అప్పులు పెరగడం..తల్లిదండ్రులు మందలించడం తో ఇలా కాదని హైదరాబాద్ వెళ్తాడు. పార్ట్‌ టైమ్ జాబ్ చేస్తూ ఆసు యంత్రాన్ని పార్టులు పార్టులుగా తయారు చేయడం మొదలు పెడతాడు. మరి ఆలా పార్ట్ పార్ట్ లుగా మొదలు పెట్టిన ఆసు యంత్రాన్ని ఎప్పుడు పూర్తి చేస్తాడు..? ఆ అసూయాత్రం ఎలా పనిచేస్తుంది..? అసూయాత్రం వల్ల ఎలాంటి లాభాలు..? ఈ అసూయాత్రం కనిపెట్టే పనిలో మల్లేశం భార్య ఎలా సపోర్ట్ చేసింది..? ఈ యంత్రం వల్ల మల్లేశం కు ఎలాంటి గుర్తింపు వచ్చిందనేది..మీరు తెరపై చూడచ్చు.

ప్లస్ :

* మల్లేశం రోల్ లో ప్రియదర్శి నటన

* డైరెక్షన్

* కామెడీ & ఎమోషన్

మైనస్ :

* అక్కడక్కడా స్లో నేరేషన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఇప్పటివరకు ప్రియదర్శి అంటే నవ్విస్తాడనే తెలుసు కానీ..ఈ సినిమా ద్వారా ఈయనతో మరో కోణం కూడా ఉందని బయటపడింది. మల్లేశం పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. మల్లేశం జీవితాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకొని నటించడం వల్ల ఆయన పాత్ర సహజంగా సాగింది. ముఖ్యంగా తండ్రి ఆసు యంత్రాన్ని కిరోసిన్ పోసి తగులపెట్టే సన్నివేశంలో ప్రియదర్శి నటన కంటతడిపెట్టిస్తుంది. తల్లి కష్టాన్ని చూసి..ఎలాగైనా తల్లిని కష్టాలనుండి బయటపడేయాలని కొడుకుగా ఎంతో చక్కగా నటించాడు.

* మల్లేశం భార్య పాత్రలో అనన్య ఆకట్టుకుంది. ఫస్ట్ హాఫ్ లో చలాకీ పిల్లగా, సెకండ్ హాఫ్ లో భర్త కష్టాల్లో తోడుండే భార్యగా భిన్నకోణాలతో కూడిన పాత్రలో మంచి అభినయాన్ని కనబరిచింది.

* మల్లేశం మామ పాత్రలో లక్ష్మణ్ ఏలె తన పరిధిలో మెప్పించాడు. యూ ట్యూబ్ మై విలేజ్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న గంగవ్వ పాత్ర సంభాషణలతోనే వినోదాన్ని పండించింది.

* ఇక మల్లేశం తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ తన నటనను మరోసారి బయటకు తీసింది. కొడుకు ఉన్నతిని కోరుకుంటూ నిరంతరం సంఘర్షణకులోనయ్యే తల్లిగా ఝాన్సీ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేసింది. తల్లి కొడుకు సెంటిమెంట్ బలంగా పండటానికి ఝాన్సీ అభినయమే కారణమైంది.

* ఇక మిగతా నటీనటులు తమ పాత్ర పరిది మేరకు మెప్పించారు.

సాంకేతిక విభాగం :

* బాలు శాండిల్య సినిమా ఫొటోగ్రఫీ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. రియల్ లొకేషన్లలో చిత్రీకరణ చేయడంవల్ల ప్రతి సన్నివేశంలో సహజత్వం ప్రతిఫలించింది. మల్లేశం పెళ్లి ఘట్టాలు, పీరీల పండుగ తాలూకు సన్నివేశాల్లో పల్లె తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాల్ని గొప్పగా చూపించారు.

* కథ కు తగ్గట్లే మ్యూజిక్ అందించారు మార్క్ కె రాబిన్. నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. పల్లేఒడిలోనా పిల్లల గుడి ఆట, ఓహో జాంబియా (పీరీల నేపథ్య పాట) ఆకట్టుకున్నాయి.

* లక్ష్మణ్ ఏలె కళాదర్శకత్వం అద్బుతంగా ఉంది.

* పెద్దింటి అశోక్ కుమార్ సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

* రాజ్‌ ఆర్, శ్రీ అధికారి నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ రాజ్‌ ఆర్‌ విషయానికి వస్తే ..బయోపిక్ తీయడం అంటే మాములు విషయం కాదు..ఏమాత్రం తేడాకొట్టిన ఫలితం వేరేలా ఉంటుంది. ప్రతిదీ చాల జాగ్రత్త పడాల్సిందే. ఇక ఇలాంటి సినిమా అంటే కత్తిమీద సాము లాంటిది. 90వ దశకంలో జరిగే కథ ఇది. మల్లేశం బాల్యం మొదలుకొని, అతని ప్రేమాయణం, ఆసు యంత్రం తయారీలో ఎదుర్కొన్న కష్టనష్టాల్ని అందంగా, భావోద్వేగభరితంగా ఈ చిత్రంలో ఆవిష్కరించారు.

కథకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడంలోనే మొదటి విజయం ఉంటుంది. అందులోనే మల్లేశం దర్శకుడు రాజ్‌ ఆర్‌ ప్రతిభ కనపడుతుంది. మొదటిసారి పూర్తిగా తెలంగాణ నేతన్నల సమాజాన్ని తెరపై ఆవిష్కరించాడు. తెలంగాణ యాస అంటే కేవలం నవ్వించిడమే కాదు.. ఏడిస్తుంది, దానికి కూడా అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని చూపించాడు. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడిని మల్లేశంతో పాటే ప్రయాణించేలా చేయడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. కేవలం కమర్షియల్ యాంగిల్ లోనే సినిమాను చూడకుండా ఓ మనసు తో చూస్తే ఎంతో బాగుంటుంది.

Click here for English Review