రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు

స్టార్ కాస్ట్ : బాలకృష్ణ , విద్యా బాలన్ , రానా , సచిన్‌ కేద్కర్‌ తదితరులు..
దర్శకత్వం : క్రిష్
నిర్మాతలు: బాలకృష్ణ
మ్యూజిక్ : కీరవాణి
విడుదల తేది : ఫిబ్రవరి 22, 2019

రివ్యూ : ఎన్టీఆర్ మహానాయకుడు

నంద‌మూరి బాల‌కృష్ణ‌ – క్రిష్ కలయికలో నందమూరి తారకరామారావు జీవిత కథ గా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్ బయోపిక్. ఈ బయోపిక్ ను రెండు భాగాలుగా రూపొందించారు. మొదటి భాగం ఎన్టీఆర్ – కథానాయకుడు , రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు. రెండో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ ఎలాంటి అంచనాలు లేకుండా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య సంక్రాంతి బరిలో వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు ప్రేక్షకులను , అభిమానులను నిరాశ పరచడమే కాదు.. ఎన్నో విమర్శలు అందుకోవడం , బయ్యర్లకు సైతం భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. దీంతో రెండో పార్ట్ ఫై ఎవరికీ పెద్దగా అంచనాలు ఏర్పడలేదు.

ఎన్టీఆర్ రాజకీయ కోణం లో ఈ సినిమా ఉండబోతుందని తెలిసిన ఎవరు కూడా పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారు. మరోపక్క చిత్ర యూనిట్ సైతం ఎలాంటి ప్రమోషన్లు చేయకుండా సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చింది. మరి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది..? ఎన్టీఆర్ రాజకీయ కోణాన్ని పూర్తిగా చూపించారా..లేదా ? ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాన్ని ఎలా తెలియజేసారు..? అసలు మహానాయకుడు కథను ఎక్కడికి వరకు చూపించారు..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు లో ఎన్టీఆర్ రాజకీయ పార్టీ ప్రకటన చేయడం తో ముగుస్తుంది…రెండో పార్ట్ పార్టీ ప్రకటన దగ్గరి నుండి మొదలువుతుంది. తన పార్టీ పేరు తెలుగుదేశంగా నిర్ణయించి, ప్రకటిస్తాడు. పార్టీ ప్రచారానికై తన పాత చెవ్రోలెటు వ్యానును బాగు చేయించి, దానిని ఒక కదిలే వేదికగా తయారు చేయించాడు. దానిపై నుండే ఆయన తన ప్రసంగాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్ళాడు. ఆలా 9 నెలల్లోనే అధికారం లోకి వస్తాడు.

ఆలా అధికారంలోకి వచ్చాక ప్రజా ఆకర్షణ పథకాలు ప్రవేశ పెట్టి ఎంతో కీర్తి పొందుతాడు. ఇది జీర్ణించుకోలేని నాదెండ్ల భాస్కరరావు ఎన్టీఆర్ వెంట ఉంటూనే ఆయనకు వెన్నుపోటు పొడుస్తాడు. దీంతో ఎన్టీఆర్ సీఎం కుర్చీ దూరం అవుతుంది. అప్పటికే క్యాన్సర్ తో బాధపడుతున్న ఎన్టీఆర్ భార్య బసవతారకం మళ్లీ మీరు సీఎం కావాలని అదే నా చివరి కోరిక అని చెపుతుంది. దాంతో తిరిగి ఎన్టీఆర్ ఢిల్లీ స్థాయిలో పోరాడి రాష్ట్రపతిని కలిసి తిరిగి రెండోసారి సీఎం‌గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. రెండో సారి సీఎం అయ్యేందుకు ఎన్టీఆర్ ఎలా కష్టపడ్డాడు..? చంద్రబాబు తెలుగుదేశం పార్టీ లోకి ఎలా వచ్చారు..? ఆయన పార్టీ కి ఎలా పనిచేసాడు..? ఎన్టీఆర్ తో ఎలా ఉండేవారు..? నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు ఎలాంటింది..? అనే రాజకీయ అంశాలు మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

* బాలకృష్ణ – విద్యా బాలన్ యాక్టింగ్

* ఎమోషనల్ సీన్స్

* రాజకీయ కోణాలు

మైనస్ :

* ఎన్టీఆర్ రాజకీయ కోణాన్ని పూర్తిగా చూపించలేకపోవడం

* చంద్రబాబు అంశాలు

* నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు మాత్రమే చూపించడం

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* ఎన్టీఆర్ గా నటించిన నందమూరి బాలకృష్ణ మొదటి భాగంలో అంతగా సెట్ కాకపోయినా , రెండో భాగంలో మాత్రం కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆయన వేషధారణ , మాటలు, నడక ఇవన్నీ కూడా ఎన్టీఆర్ కు దగ్గరిగా ఉన్నాయి. రాజ‌కీయ నాయ‌కుడిగా, భ‌ర్త‌గా రెండు చోట్ల అద్భుతంగా నటించడమే కాదు జీవం పోసాడు. అసెంబ్లీలో సొంత పార్టీకి చెందిన నాదెండ్ల అనుకూల వర్గం ఎన్టీఆర్‌ని నానా మాటలు అంటుంటే కోపాల్ని లోలోపలే ఉంచుకుని రగిలిపోయే సీన్‌లో బాలయ్య మెప్పించారు.

* ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ అద్భుతంగా నటించారు. డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తూ భావోద్వేగ సన్నివేశాల్ని రక్తికట్టించారు. 12 మంది సంతానికి తల్లిగా.. ఉత్తమ ఇల్లాలు పాత్రలో ఆమె ఒదిగిపోయారు.

* చంద్ర‌బాబు నాయుడు పాత్ర‌లో రానా న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. చంద్ర‌బాబు నాయుడు బాడీ లాంగ్వేజ్‌ని రానా పుణికి పుచ్చుకున్నాడు. కొన్ని ప‌దాల్ని చంద్ర‌బాబు ఎలా ప‌లుకుతారో మ‌నంద‌రికీ తెలుసు. రానా కూడా అదే విధానంతో ‘ముందుకు పోయాడు’.

* నాదెండ్ల భాస్కరరావు (సచిన్‌ కేద్కర్‌) ఈయన వేషధారణ అంత అచ్చం నాదెండ్ల ను చూసినట్లే అనిపిస్తుంది. ఈ రెండో పార్ట్ మొత్తం ఈయన చుట్టూనే తిరుగుతుంది. పార్టీ సింబల్ దగ్గర నుండి అభ్యర్ధుల జాబితా.. రూట్ మ్యాప్ ఇలా పార్టీకి సంబంధించిన కీలక వ్యవహారాలన్నీ ఈయనే చూసుకుంటాడు. కానీ చివరికి ముఖ్యమంత్రి పీఠం కోసం ఎన్టీఆర్‌ని పక్కనే ఉండి వెన్నుపోటు పొడుస్తాడు. ఈ పాత్ర కు ఈయన్ను ఎంచుకొని క్రిష్ సక్సెస్ అయ్యాడు.

* ఇక ఎన్టీఆర్ చైతన్య రథ సారధిగా హరిక్రిష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ ఆకట్టుకున్నారు. తల్లి బసవతారకంతో వచ్చే ఎమోషన్ సీన్లలో కన్నీరు పెట్టించారు.

* దగ్గుబాటి వెంకటేశ్వరరావు‌గా భరత్ రెడ్డి, నందమూరి త్రివిక్రమ్ రావుగా దగ్గుబాటి రాజా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, ఇందిరా గాంధీగా సుప్రియా వినోద్, నారా భువనేశ్వరిగా మంజిమ మోహన్, పురుంధేశ్వరిగా హిమాన్సి చౌదరి మొదలగు నటి నటులంతా వారి పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక విభాగం :

* కీరవాణి మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ బాగుంది.

* సాయి మాధవ్ మాటలు చాల బాగా పేలాయి. ‘నిశబ్దాన్ని చేతగాని తనం అనుకోవద్దు.. మౌనం మారణాయుధంతో సమానం అని మరిచిపోవద్దు’, ‘నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను’ లాంటి డైలాగ్స్‌ బాగా ఆకట్టుకున్నాయి.

* జ్ఞాన శిఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. బహిరంగ సభలు.. క్రౌడ్ షాట్స్ చాలా రిచ్‌గా చూపించారు.

* ఎన్‌బీకే బ్యానర్‌లో బాలయ్య నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ క్రిష్ విషయానికి వస్తే..ఎన్టీఆర్ బయోపిక్ ను ఒకే కథగా చూపిస్తే బాగుండేది. మహానాయకుడు తెరకెక్కించిన తీరు చూస్తే ఎవరికైనా అదేనిపిస్తుంది. రెండు భాగాలు అనవసరం. సింపుల్ గా రెండున్నర గంటల్లో చూపించేయచ్చు.

వెండితెర ఫై రారాజు గా ఉన్న ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది..? అప్పటి పరిస్థితులు ఏంటి..? ఆలా వచ్చిన ఎన్టీఆర్ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు..? ఆ తర్వాత రాజకీయాల్లో ఎలాంటి అవమానాలు, ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు..? భార్య తో , రాజకీయాలతో ఎలా గడిపాడు..? అనేది మాత్రమే చూపించాడు. కానీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలాంటి మానసిక క్షోభకు గురైయ్యాడు అనేది చూపించలేదు. అంతే కాదు ఎన్టీఆర్ ఆఖరి రోజుల్లో ఆయన వెంట ఉన్న లక్ష్మీ పార్వతి ని ఏమాత్రం చూపించలేదు. మరి వర్మ చూపిస్తాడు కదా మనమెందుకులే అనుకున్నాడో ఏమో..గాని ఎన్టీఆర్ బయోపిక్ అంటే అందరూ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అన్ని అంశాలు ఉంటాయని అనుకున్నారు. కానీ అందరికి తెలిసిందే చూపించారు తప్ప చాలామందికి తెలియని ఎన్టీఆర్ అసలు సిసలైన అంశాలను చూపించలేకపోయారు.

ఓవరాల్ గా ఎన్టీఆర్ రాజకీయ కోణాన్ని కొంత వరకే చూపించి చేతులు దులుపుకున్నారు తప్ప జనాలు చూడాలన్నా కథను మాత్రం చూపించలేకపోయారు.