రివ్యూ : శ్రీనివాస కళ్యాణం – యూత్ చూడలేరేమో..

స్టార్ కాస్ట్ : నితిన్ ,రాశిఖన్నా , ప్రకాష్ రాజ్ తదితరులు..
దర్శకత్వం : సతీశ్ వేగేశ్న
నిర్మాతలు: దిల్ రాజు
మ్యూజిక్ : మిక్కీ జె మేయర్
విడుదల తేది : ఆగస్టు 09, 2018
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : శ్రీనివాస కళ్యాణం – యూత్ చూడలేరేమో..

రంగస్థలం, భరత్ అనే నేను, మహానటి చిత్రాల తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద సినిమాలేవీ రాలేదు. వచ్చిన చిన్న చిత్రాల్లో ఒక్క ఆర్ ఎక్స్ 100 తప్ప మిగతా చిత్రాలేవీ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల ప్రభంజనం సృష్టించలేకపోయాయి. గత వారం విడుదలైన ‘గూఢచారి’.. ‘చి ల సౌ’ మంచి టాక్ తెచ్చుకుని వాటి వాటి స్థాయిలో మంచి వసూళ్లే రాబడుతూ సాగిపోతున్నాయి.

ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో ‘శతమానం భవతి’ దర్శకుడు సతీశ్ వేగేశ్న రూపొందించిన చిత్రమిది. నితిన్-రాశి ఖన్నా జంటగా నటించారు. శ్రీనివాస కళ్యాణం అనే టైటిల్ ప్రకటించినప్పటి నుంచి ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ అందరిలో కలిగింది. దీనికి తోడు ఈ చిత్ర ప్రోమోలు మరింతగా ఆ ఫీల్ ను పెంచాయి. టీజర్.. ట్రైలర్ రెండూ కూడా ప్లెజెంట్ గా అనిపించడం తో సినిమాపై అందరిలో అంచనాలు పెరిగాయి. మరి అంచనాలకు తగట్టు సినిమా ఉందా..లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

చంఢీఘర్‌లో ఆర్కిటెక్ట్‌గా పనిచేసే శ్రీనివాస్‌ (నితిన్ ) కి చిన్నప్పటి నుండి తెలుగు సంప్రదాయాలు అంటే ఎంతో ఇష్టం. ఏ పని చేసిన మన తెలుగు సంప్రదాయాలకు కట్టుబడి చేయాలనీ తన నాయనమ్మ (జయసుధ ) మాటలకు కట్టుబడి ఉంటాడు. ముఖ్యంగా పెళ్లి విషయం లో తప్పనిసరిగా తెలుగు సంప్రదాయ ప్రకారం చేసుకోవాలని అనుకుంటాడు. ఓ రోజు కాఫీ డేలో ప‌నిచేస్తున్న శ్రీదేవి (రాశీ ఖ‌న్నా) ని చూసి ఇష్టపడతాడు. శ్రీనివాస్ చెప్పే సంప్రదాయాలు , ఆయన విధానం నచ్చిన శ్రీదేవి.. అతడితో ప్రేమలో పడుతుంది. తమ ప్రేమ విషయాన్నీ ముందుగా శ్రీదేవి తండ్రి.. ఆర్కే గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు చెందిన ఆర్కే (ప్రకాష్ రాజ్‌) కు తెలియజేస్తారు.

ప్రతిదీ బిజినెస్ గా చూసే ఆర్కే..కూతురి పెళ్లి కూడా బిజినెస్ గానే చూస్తాడు. ఈ నేపథ్యం లో శ్రీనివాస్ కు ఓ అగ్రిమెంట్ తెలియపరుస్తాడు. అదేంటి అంటే ఒక‌వేళ త‌న కూతురు ఎప్పుడైనా విడిపోవాల‌నుకుంటే విడాకులు వెంట‌నే ఇచ్చేయాల‌ని ముందుగానే అగ్రిమెంట్ చేయించుకుంటాడు. దీనికి సరే అని చెప్పిన శ్రీనివాస్..తాను కూడా ఆర్కే కు ఓ కండిషన్ పెడతాడు..ఆ కండిషన్ ఏంటి..? దీనికి ఆర్కే ఒప్పుకుంటాడా..? లేదా..? పెద్దల ఇష్టం తోనే శ్రీనివాస్ , శ్రీదేవిలా పెళ్లి జరుగుతుందా..లేదా..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.

ప్లస్ :

* కుటుంబ విలువల సన్నివేశాలు

* బ్యాక్ గ్రౌండ్ స్కోర్

* పెళ్లి స‌న్నివేశంలో వ‌చ్చే సంభాష‌ణ‌లు

* నటి నటులు

మైనస్ :

* క్లైమాక్స్

* సెంటిమెంట్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* నితిన్ చాల న్యాచురల్ గా నటించాడు..రాశిఖన్నా పాత్ర కీలకమైనప్పటికీ దానిని వాడుకోవడం లో డైరెక్టర్ విఫలం అయ్యాడు. ఈ ఇద్ద‌రి జంట తెర‌పై చూడ‌టానికి బాగుంది.

* ప్రతిదీ బిజినెస్ గా ఆలోచించే పాత్రలో ప్రకాష్ రాజ్ తనదయిన రీతిలో నటించాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో నితిన్, ప్ర‌కాశ్ రాజ్ మ‌ద్య న‌డిచే ఎమోష‌న‌ల్ సీన్‌లో నితిన్ డైలాగ్స్ వివ‌ర‌ణ మ‌రీ ఎక్కువైన‌ట్లు అనిపించాయి.

* పద్మావతిగా నందిత శ్వేతకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. ఫస్ట్‌ హాఫ్‌లో అల్లరి అమ్మాయిగా అలరించిన నందిత సెంకడ్‌ హాఫ్‌లో ఎమోషనల్‌ సీన్స్‌లోనూ మెప్పించింది.

* జ‌య‌సుధ‌, రాజేంద్ర‌ప్ర‌సాద్‌, సీనియ‌ర్ న‌రేశ్‌, ప్ర‌భాస్ శ్రీను, సితార‌, ఆమ‌ని ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

* తెరపై చాల మందే నటి నటులు ఉన్నప్పటికీ వారిని ఉపయోగించుకోవడం లో సతీష్ విఫలం అయ్యాడు.

సాంకేతిక విభాగం :

* మిక్కీ జె మేయర్ సంగీతం బాగుంది. ముఖ్యం గా పెళ్లి సాంగ్ అందర్నీ కట్టిపడేసింది. అలాగే కథకు తగ్గట్లే నేపధ్య సంగీతం ఇచ్చి ఆకట్టుకున్నాడు.

* స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ గా నిలిచింది.

* ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

* ఇక డైరెక్టర్ విషయానికి వస్తే తాను రాసుకున్న కథ చాల మంచిదే కానీ దానిని తెరపై చూపించడం లో విఫలం అయ్యాడు. చాల చోట్ల అవసరం లేని సన్నివేశాలు జోడించి బోర్ కొట్టించాడు. ముఖ్యం గా క్లైమాక్స్ విషయం లో కాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండు. కుటుంబ విలువల గురించి చెప్పే కొన్ని సన్నివేశాలు బాగా నచ్చుతాయి. అలాగే పెళ్లి వేడుకలో మాటలు ఆలోచింపజేసేలా రాసుకున్నాడు.

ప్రస్తుతం లవ్ , రొమాన్స్ , కాస్త మసాలా సన్నివేశాలను ఇష్టపడే యూత్..ఇలాంటి పెళ్లి తంతు కథలు చూసేందుకు ఇష్టపడతారా అనేది చూడాలి. ఏది ఏమైనప్పటికి మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సతీశ్ వేగేశ్న బాగానే కష్టపడ్డాడు దాని ఫలితం ప్రేక్షకులు ఎలా ఇస్తారు అనేది చూడాలి.