రివ్యూ : ‘ విజిల్ ‘ వేయాల్సిందే…

స్టార్ కాస్ట్ : విజ‌య్‌, న‌య‌న‌తార‌, జాకీష్రాఫ్‌ తదితరులు..
దర్శకత్వం : అట్లీ
నిర్మాతలు: ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌
మ్యూజిక్ : రెహ‌మాన్‌
విడుదల తేది : అక్టోబర్ 25, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

రివ్యూ : ‘ విజిల్ ‘ వేయాల్సిందే…

‘తెరి’ ‘మెర్సల్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ల తర్వాత విజయ్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘బిజిల్’ ( తెలుగు లో విజిల్). నయనతార విజయ్ కి జోడిగా నటించగా.. కతిర్, యోగిబాబు, వివేక్, జాకీష్రాఫ్, ఇందుజా రవిచంద్రన్, ఆనంద్ రాజ్, మోనికా జాన్ తదితరులు నటించారు.

ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించగా.. ఏజీఎస్ ఎంటర్‌టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై అఘోరం కల్పతి సుబ్రమణ్యన్ నిర్మించారు. తెలుగులో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్‌పై మహేష్ ఎస్. కోనేరు ఈ చిత్రాన్ని విడుదల చేశారు. దీపావళి సందర్భంగా ఈరోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఇక మూవీ ఎలా ఉంది..? అట్లీ విజయ్ ని ఎలా చూపించాడు..? ఈ కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

రాయప్పన్ (విజయ్ )..ఓ రౌడీ. తన బస్తి వాసుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారి బాగోగులు చేస్తుంటాడు. ఈయన కు మైఖేల్ అలియాస్ విజిల్ (విజయ్ ) అనే కొడుకు ఉంటాడు. ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌ అయినా విజిల్ ఎప్పటికైనా నేషనల్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌ కావాలని కలలు కంటుంటాడు.

ఈ నేపథ్యంలో రాజప్పన్ ను కొంతమంది చంపేస్తారు. ఆ తర్వాత మైకేల్ ..మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌‌గా వెళ్లాల్సి వస్తుంది. ఆ క్రమంలో అతనికి ఎదురైన అవరోధాలు ఏంటి..? అసలు మైకేల్ మహిళా ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌‌గా ఎలా వెళ్తాడు..? అసలు కిరణ్‌ ఎవరు..? కిరణ్ కు మైకేల్ కు సంబంధం ఏంటి..? అలాగే ఏంజెల్ (నయనతార ) కు విజిల్ కు సంబంధం ఏంటి..? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ :

* విజయ్

* రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ :

* ఫస్ట్ హాఫ్

* బోరింగ్ సన్నివేశాలు

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* విజయ్ నటన గురించి వంక పెట్టాల్సిన పనిలేదు..ఇక ఈ సినిమాలో రాయప్పన్..మైకేల్ గా రెండు పాత్రల్లో ప్రాణం పోసాడు. రాజ‌ప్ప పాత్ర అభిమానులను ఆక‌ట్టుకునేలా మాస్‌గా ఉంటే.. మైకేల్ పాత్ర తండ్రి ఆశ‌యాల కోసం పాటుప‌డే ఓ ఇన్‌స్పిరేష‌న‌ల్‌గా ఉంటుంది. ఈ రెండు పాత్రలు అభిమానులను ఎంతగానో నచ్చుతాయి.

* నయనతార తన పరిధి మేరకు బాగానే నటించింది.

* జాకీష్రాఫ్ స్టైలిష్ విల‌న్‌గా న‌టించి ఆక‌ట్టుకున్నాడు.

* ఫుట్‌బాల్ టీమ్‌గా నటించిన వ‌ర్ష బొల్ల‌మ్మ‌, ఇందుజ‌, రెబా మోనిక‌, అమృత ఇలా అంద‌రూ వారి వారి పాత్ర‌ల్లో చ‌క్క‌గా న‌టించారు.

* యోగిబాబు, క‌దిర్, డేనియ‌ల్ బాలాజీ త‌దిత‌రులు వారి పరిధిలో నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం :

* లెజెండ్ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ ఈ చిత్రానికి చక్కటి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. పాటలు పెద్దగా లేకపోయినా బ్యాక్ గ్రౌండ్ మాత్రం అదిరిపోయింది.

* శ్రీరామ‌కృష్ణ రాసిన డైలాగ్స్ సెకండాఫ్‌లో ముఖ్యంగా ఆక‌ట్టుకున్నాయి.

* జీకే విష్ణు నీట్‌ సినిమాటోగ్రఫి సినిమాకు హైలైట్ గా నిలిచింది. ముఖ్యంగా ఫుట్‌బాల్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన తీరు బావుంది.

* ఆర్ట్‌ డైరెక్టర్‌ ముథురాజు పనితనం ఆకట్టుకుంది.

* నిర్మాణ విలువలు బాగున్నాయి.

* ఇక డైరెక్టర్ అట్లీ విషయానికి వస్తే..

ప‌క్కా మాస్ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ ఎంటర్టైనర్ గా కథ రాసుకొని సక్సెస్ అయ్యాడు. మొదటి అర్ధగంట
విజయ్ అభిమానులను దృష్టి లో పెట్టుకొని కథ రాసుకున్నాడని అనిపిస్తుంది. విజయ్ నుండి ఏమి కోరుకుంటారో మొదటి అరగంటలోనే అంత చూపించాడు. సెకండాఫ్ అంతా ఫుట్‌బాల్ గేమ్ మీద‌నే సినిమా సాగుతుంది. ఇందులో ప్ర‌త్య‌ర్థి విజ‌య్ టీమ్‌ను ఆడించ‌కుండా ఉండాల‌నుకోవ‌డం.. విజ‌య్ దాన్ని తెలివిగా ఆడ్డుకోవ‌డం వంటి సీన్స్‌తో సినిమాను ర‌క్తి క‌ట్టించారు. అలాగే ఫుట్‌బాల్ మ్యాచ్‌ల‌ను చాలా లావిష్‌గా తెర‌కెక్కించారు.

మన దేశంలో క్రీడల్లోకి వచ్చేందుకు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు అట్లీ కొంత నిజాయితీగా చూపించడం ఆకట్టుకుంటుంది. తనకు ప్రేమ కన్నా ఫుట్‌బాలే ముఖ్యమన్నందుకు ఓ ఉన్మాది చేతిలో యాసిడ్‌ దాడికి గురైన అనితా.. కోచ్‌ ఇచ్చిన మనోస్థైర్యంతో తిరిగి జట్టులోకి వచ్చి రాణించడం, పెళ్లయి.. సంప్రదాయ కుటంబంలో గృహిణిగా సెటిలైన రమ్య తిరిగి జట్టులోకి రావడం వంటి చక్కని అంశాలు సినిమాలో ఆకట్టుకుంటాయి. సినిమాలో గొప్ప ట్విస్టులు ట‌ర్న్‌లు ఉండకపోయినా.. స‌న్నివేశాల‌ను ఎంగేజింగ్‌గా, హీరోయిజాన్ని ఎలివేట్ చే్స్తూ తెర‌కెక్కించ‌డంలో అట్లీ స‌క్సెస్ సాధించాడు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో కాస్త బోరింగ్ సన్నివేశాలు ప్రేక్షకులను విసుగు తెప్పిస్తాయి. ఓవరాల్ గా థియేటర్స్ లలో విజిల్ కొట్టించాడు.

తెలుగు మిర్చి రేటింగ్ : 3/5

Click here for English Review