రివ్యూ : ‘వరల్డ్ ఫేమస్ లవర్’ – బోరింగ్ లవర్

స్టార్ కాస్ట్ : విజ‌య్ దేవ‌ర‌కొండ‌, రాశీఖ‌న్నా, క్యాథ‌రిన్ ట్రెసా, ఐశ్వ‌ర్యా రాజేశ్‌, ఇజబెల్లా లెయితె తదితరులు..
దర్శకత్వం : క్రాంతి మాధవ్
నిర్మాతలు: క‌్రియేటివ్ క‌మ‌ర్షియ‌ల్స్‌
మ్యూజిక్ : గోపిసుందర్
విడుదల తేది : ఫిబ్రవరి 14, 2019
తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

రివ్యూ : ‘వరల్డ్ ఫేమస్ లవర్’ – బోరింగ్ లవర్

విజయ్ దేవరకొండ , రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్, ఇజాబెల్లె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేయగా.. గోపీ సుందర్ సంగీతం అందించారు. కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉంది…? ఈ సినిమా తో విజయ్ హిట్ అందుకున్నాడా లేదా..? ఈ సినిమా కథ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశీ ఖన్నా) అమితంగా ప్రేమించుకుంటారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోకుండా సహజీవనం చేస్తుంటారు. గౌతమ్ కు ఎప్పటికైనా పెద్ద రైటర్ కావాలని కోరిక..దాంతో ఉద్యోగం వంటింవి చేయకుండా కథలు రాస్తూ కాలం వెళ్లదీస్తుంటాడు. కొన్ని రోజులకు యామిని కి , గౌతమ్ ప్రవర్తన నచ్చకపోవడం తో బ్రేకప్ చెప్పి తన ఇంటికి వెళ్ళిపోతుంది.

యామిని వెళ్ళిపోయినా బాధలో గౌతమ్ ఓ కథ రాయడం మొదలుపెడతాడు.. మరి ఆ కథ ఏంటి..? ఆ కథ కు సీనయ్య (విజయ్ దేవరకొండ), సువర్ణ (ఐశ్వర్య రాజేష్), స్మిత మేడమ్ (కేథరిన్) సంబంధం ఏంటి..? గౌతమ్ ..శీనయ్య గా మారతాడా..? లేక శీనయ్య నే గౌతమ్ అవుతాడా..? అసలు ఏంటి ఈ కథ అనేది మీరు సినిమా చూస్తే అర్ధమవుతుంది.

ప్లస్ :

* ఫస్ట్ హాఫ్

* విజయ్ దేవరకొండ యాక్టింగ్

* కొత్తగూడెం సన్నివేశాలు

మైనస్ :

* సెకండ్ హాఫ్

* కామెడీ లేకపోవడం

* సినిమా రన్ టైం

* డైరెక్షన్

న‌టీన‌టుల పెర్పామెన్స్ :

* విజయ్ దేవరకొండ యాక్టింగ్ గురించే చెప్పాల్సిన పని లేదు..ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ నాలుగు విభిన్న గెటప్పుల్లో ఆకట్టుకున్నాడు. రాశీ ఖన్నాతో బ్రేకప్ ఎపిసోడ్ లో ‘అర్జున్ రెడ్డి’ ని గుర్తు చేసాడు. కాలేజ్ ఎపిసోడ్ లో యువకుడిగా మెప్పించారు. కొత్తగూడెం నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్ అయితే నటుడిగా విజయ్ దేవరకొండలో మరో కోణాన్ని ఆవిష్కరించింది. బొగ్గు గని కార్మికుడిగా, పదో తరగతితో చదువు ఆపేసిన యువకుడిగా… గ్రామీణ తెలంగాణ వాతావరణంలో యువకులు ఎలా ఉంటారో అలాగే కనిపించారు. పారిస్ ఎపిసోడ్ లో స్టైలిష్ గా కనిపించాడు. ఇలా అన్ని కోణాల్లో తనదైన నటన కనపరిచి ఆకట్టుకున్నాడు.

* రాశిఖన్నా మరోసారి తన మార్క్ నటనతోనే కాదు గ్లామర్ తో ఆకట్టుకుంది. కథా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకుంటున్న మరో నటి ఐశ్వర్యా రాజేశ్‌.. సువర్ణ అనే డీ గ్లామర్‌, మధ్య తరగతి గృహిణి పాత్రలో అదరగొట్టింది.

* క్యాథరీన్‌, ఇజాలకు నటనపరంగా కంటే తమ అందాలతో యూత్ ను ఆకట్టుకున్నారు.

* తమిళ నటుడు జయప్రకాష్ తనకు అలవాటైన పాత్రలో, రిచ్ ఫాదర్ గా కనిపించారు. విజయ్ దేవరకొండ స్నేహితుడిగా ప్రియదర్శి పాత్ర రెండు మూడు సన్నివేశాలకు పరిమితమైంది. శత్రు, ఆనంద చక్రపాణి తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగిలినవారు వారి వారి పరిధిలో నటించి మెప్పించారు.

సాంకేతిక విభాగం :

* గీత గోవిందం చిత్రానికి గోపి తన మ్యూజిక్ తో ఆకట్టుకోగా..ఈ సినిమా విషయంలో నిరాశ పరిచాడు. ‘బొగ్గుగనిలో రంగు మణిరా’ పాట బావుంది. మిగతా పాటలకు తేలిపోయాయి. నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపించింది.

* జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రథమార్థం అంతా చకచకా సాగినప్పటికీ… ద్వితీయార్థం వచ్చేసరికి కదా నెమ్మదిగా వెళ్తున్న భావన కలుగుతుంది.

* క్రాంతి మాధవ్‌ అందించిన మాటలు ఆకట్టుకుంటాయి. ‘కలం కాగితం లేకుండా ప్రపంచ చచ్చిపోతుంది, రాయడం అంటే రచయిత తన ఆత్మను పంచడం, ప్రపంచ బాధలను తన బాధలుగా భావించి రచయిత రాయడం ప్రారంభిస్తాడు’ అంటూ చెప్పే డైలాగ్‌లు బాగున్నాయి.

* నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గలేదని సినిమాను తెరపై చూస్తే అర్థమవుతుంది.

* ఇక డైరెక్టర్ క్రాంతి మాధవ్ విషయానికి వస్తే..ఫస్ట్ హాఫ్ ను స్పీడ్ గా నడిపించిన ఈయన..సెకండ్ హాఫ్ బోరింగా నడిపించి ప్రేక్షకులకు విసుగు తెప్పించాడు. ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో రాజి తత్వం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుంది. ప్రేమలో ఒకరిపై మరొకరికి అంతులేని ఆరాధన ఉంటుందనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కించినప్పటికీ..దానికి సరైన న్యాయం చేయలేకపోయాడు. కామెడీ ఫై ఏమాత్రం దృష్టి పెట్టకపోవడం పెద్ద మైనస్.

కొన్ని ఎమోషన్‌ సీన్లు కట్టిపడేశాల ఉన్నాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌కు ముందు విజయ్‌ ఇచ్చే స్పీచ్‌ సినిమాను నిలబెట్టే విధంగా ఉంటుందనుకున్న తరుణంలో.. అర్జున్‌రెడ్డి క్లైమాక్స్‌తో దర్శకుడు సినిమాను ముగించాడు.

ఓవరాల్ గా .. కథ కొత్తదే అయినప్పటికీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించడంలో క్రాంతి విఫలం కావడం తో సినిమా తేలిపోయింది.

తెలుగు మిర్చి రేటింగ్ : 2.75/5

Click here for English Review