స్వర్ణం సాధించిన తొలి భారత మహిళ..


ప్ర‌పంచ జూనియ‌ర్ వ‌ర‌ల్డ్ అథ్లెటిక్ పోటీల‌లో భారత్ కు స్వ‌ర్ణ ప‌త‌కం తీసుకొచ్చి తొలి భారత మహిళగా రికార్డు సృష్టించింది హిమ‌దాస్. అండర్-20 విభాగంలో ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో గురువారం జరిగిన 400మీటర్ల ఫైనల్లో 51.46 సెకన్లలో గమ్యం చేరి తొలిస్థానంతో బంగారు పతకం అందుకుంది. ఈ విజ‌యం పట్ల భార‌తీయులంద‌రూ గ‌ర్వంతో ఉప్పొంగుతున్నార‌ని, మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుతున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత ట్రాక్‌ అథ్లెట్‌గా కూడా హిమ ఈ ఘనత సాధించింది. రొమేనియా అమ్మాయి మిక్లో రజతం (52.07సె) నెగ్గగా.. అమెరికాకు చెందిన టేలర్‌ మాన్సన్‌ (52.28) కాంస్యం గెలుచుకుంది.

అసోంకు చెందిన హిమ గోల్ట్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 51.32 టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది. ఈ సందర్భాంగా రాజకీయ , సినీ ప్రముఖులు సైతం హిమకు తమ శుభాకాంక్షలను సోషల్ మీడియా ఖాతాలలో తెలియజేస్తున్నారు. హిమ దాస్‌కు సెల్యూట్ చేస్తున్నట్లు రాహుల్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ట్విట్టర్‌లో అభినందనలు తెలిపారు. అలాగే ప్రముఖ దర్శకుడు రాజమౌళి సైతం తన అభినందనలు తెలిపాడు.