కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మనే కానీ, చెత్త సమీక్షకుడు


ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి రెండు రీవ్యూలను వృథా చేశాడు. 12 ఓవర్ల వ్యవధిలోనే రెండు రీవ్యూలను ఇండియా కోల్పోయింది. భారత పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్‌మనే కానీ, చెత్త సమీక్షకుడు కూడా అతడే అని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ అన్నాడు.

వాన్ ఎందుకన్నడంటే ఐదో టెస్టు మూడో రోజున ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్ పదో ఓవర్లో జడేజా వేసిన బాల్ ఇంగ్లండ్ ఓపెనర్ జెన్నింగ్స్ ప్యాడ్లను తగిలింది. దీంతో ఫీల్డర్లంతా అప్పీల్ చేసినా అంపైర్ ఔటివ్వలేదు. వెంటనే కోహ్లి రీవ్యూ కోరాడు. అయితే ఇంపాక్ట్ ఔట్‌సైడ్ ఉండటంతో థర్డ్ అంపైర్ కూడా నాటౌట్ అని ప్రకటించేశాడు. ఇక 12వ ఓవర్లో మళ్లీ జడేజా బౌలింగ్‌లోనే అలిస్టర్ కుక్ ప్యాడ్స్‌కు బాల్ తగిలింది. అంపైర్ ఔటివ్వకపోవడంతో కోహ్లి మళ్లీ రీవ్యూ అడిగాడు. ఈసారి కూడా ఇంపాక్ట్ ఔట్‌సైడ్ అనే రావడంతో బ్యాట్స్‌మన్ బతికిపోయాడు.

డెసిషన్ రీవ్యూ సిస్టమ్ (డీఆరెస్) వచ్చిన తర్వాత చాలా మంది దానిని సద్వినియోగం చేసుకుంటున్నారు. అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించే అవకాశం దక్కడంతో చాలాసార్లు బ్యాట్స్‌మెన్ తప్పించుకోవడమో, బౌలర్ వికెట్ దక్కించుకోవడమే జరుగుతున్నది. ఈ విషయంలో మాజీ కెప్టెన్ ధోనీ ఎక్స్‌పర్ట్ అయిపోయాడు. ధోనీ రీవ్యూ అడిగాడంటే అది కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న పేరు అతను సంపాదించాడు. అయితే విరాట్ రీవ్యూ కోరిన చాలా వాటిల్లో ఫలితలు తేడా కొడుతున్నాయి.