
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు ఆరు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ తదితరులు ఉండే ఎనిమిది మంది బృందం ఈ పర్యటనలో పాల్గొననుంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటన అనంతరం, ఇది సీఎం చంద్రబాబు రెండో విదేశీ పర్యటనగా నిలుస్తోంది. ‘బ్రాండ్ ఏపీ’ ను ప్రపంచానికి పరిచయం చేస్తూ పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదికగా చేసుకోనున్నారు.
సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, పారిశ్రామికవేత్తలు మరియు ప్రముఖులతో భేటీ అవుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన నూతన పారిశ్రామిక విధానాలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సౌకర్యాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు. రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు, హార్బర్లు, 1053 కిలోమీటర్ల తీరప్రాంతం, మానవ వనరుల లభ్యత వంటి అంశాలను వివరించి పెట్టుబడులపై చర్చిస్తారు.
పర్యటన తొలి రోజున సింగపూర్ మరియు సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన P4 (People, Public, Private, Partnership) కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.
ఈ పర్యటనలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు తదితర రంగాలలో పెట్టుబడులపై చర్చించనున్నారు. రాబోయే నవంబరులో విశాఖపట్నంలో జరగనున్న పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు.
డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్ రంగాలపై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అదనంగా సింగపూర్‌లో జరిగే బిజినెస్ రోడ్ షోలో హాజరై పెట్టుబడిదారులను ఆకర్షించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్‌లోని మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ సెంటర్లను పరిశీలించనున్నారు.
