Site icon TeluguMirchi.com

చింతకాయల విజయ్‌కు రాజ్యసభ ఛాన్స్?

Chinthakayala vijay
ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వారసుడిగానే కాకుండా, పార్టీ కష్టకాలంలో టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని (iTDP) సమర్థవంతంగా నడిపించిన యువనేతగా చింతకాయల విజయ్‌కు పార్టీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. 2026 జూన్ నాటికి ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతుండటంతో, అసెంబ్లీలో కూటమికి ఉన్న భారీ బలం రీత్యా విజయ్‌కు ఒక స్థానం దక్కడం ఖాయమనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకున్న చింతకాయల కుటుంబానికి, అందులోనూ విపక్షంలో ఉన్నప్పుడు డిజిటల్ వేదికలపై పార్టీ గొంతుకగా నిలిచిన విజయ్‌కు ఈ పదవి ద్వారా చంద్రబాబు సముచిత గౌరవం కల్పించబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి పార్టీ గెలుపు కోసం పనిచేసిన విజయ్ త్యాగాన్ని, నారా లోకేష్‌తో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని పరిగణనలోకి తీసుకుని అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఉత్తరాంధ్రలో బలమైన బీసీ సామాజిక వర్గ ప్రతినిధిగా, ఇంగ్లీష్‌పై పట్టున్న విద్యావంతుడిగా ఢిల్లీలో పార్టీ వాణిని వినిపించేందుకు విజయ్ సరైన ఎంపిక అవుతారని పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తోంది. సీనియర్లకు గౌరవం ఇస్తూనే, సమర్థులైన యువ రక్తానికి పెద్దల సభలో అవకాశం కల్పించడం ద్వారా భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేయాలన్న తెలుగుదేశం వ్యూహంలో భాగంగా.. త్వరలోనే చింతకాయల విజయ్ రాజ్యసభలో అడుగుపెట్టడం లాంఛనమేనని రాజకీయ వర్గాల సమాచారం.

Exit mobile version