
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ పోలీసుల అనుమతుల వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జనసేన ఆధ్వర్యంలో ‘తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ – జనసేన సాధక్ సమ్మేళనం’కు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఈ రోజు ఆయన జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ గురించి జనసేన ఎందుకు మాట్లాడుతుందని అడుగుతున్నారు.. జనసేన పార్టీ పెట్టిందే హైదరాబాద్ నడిబొడ్డన.. ఇది తెలంగాణపై కొత్తగా తెచ్చుకున్న ప్రేమ కాదు.. ఇప్పుడు విమర్శించే గొంతులు 2007లో లేవు. నేను తెలంగాణ నలు మూలలా తిరిగాను.. తెలంగాణ బాగుండాలని అనుకునే వాణ్ని.. ఆదిలాబాద్ లాంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పుడు విమర్శించేవారు తిరగలేదు.. నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు.. విభజన జరిగిన తీరుకు వ్యతిరేకం. తెలంగాణ ప్రజలకు, నాయకులకు ఏపీ ప్రజలపై విద్వేషం లేదు.. హైదరాబాద్‌లో ఎలా అడుగుపెడతారని కొందరు అడుగుతున్నారు.. మీ అయ్య జాగీరా తెలంగాణ.. మీరెవరు నన్ను బెదిరించడానికి … బెదిరించేవారికి ఒకటే చెబుతున్నా.. నా ఇంటి అడ్రస్ చెప్పడానికే ఇక్కడ ప్రెస్‌మీట్ పెట్టాను.
కేసీఆర్ గురించి 12 ఏళ్లల్లో ఎప్పుడైనా మాట్లాడానా..? తెలంగాణ నేతల మీద కూడా మాట్లాడలేదు.. నన్ను వైసీపీవాళ్లు బెదిరించారు కానీ, తెలంగాణవాళ్లు బెదిరించలేదు. తెలంగాణలో ఉపాధి లేకపోతే పవన్ కళ్యాణ్ కారణమా?.. తెలంగాణలో అన్యాయం చేసేవారిని ఉరి తీయండి.. అందులో పవన్ కళ్యాణ్ ఉన్నాసరే ఉరితీయండి. నేను చెరువును ఆక్రమించానని అనుకుంటే ఈ రోజే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తా.. నేను ప్రాపర్టీ ఆక్రమిస్తే సీజ్ చేయండి. గద్దర్ బతికి ఉన్నప్పుడు మీరంతా ఏమయ్యారు..? బుల్లెట్‌లు దిగాయి నడవలేకపోతున్నా ఒక బండి కొనివ్వమని గద్దర్ అడిగారు.. మూడ్రోజుల్లో బండి కొనిచ్చాను. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేం పోటీ చేస్తాం.. నేనే తెలంగాణ అంతటా తిరుగుతా.. ఇకపై ఇలానే మాట్లాడుతా.. తెలంగాణ దేశంలో అంతర్భాగం’ అని అన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో, తెలంగాణ జనాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
