
ఈ ఏడాది కూడా శ్రీశైలం గేట్లు ఎత్తడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జలాశయానికి ఇన్‌ఫ్లో రూపంలో 1,48,696 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా, అధికారులు మూడు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయం 882.80 అడుగుల వద్ద ఉంది. ఇక పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం అందులో 203.4290 టీఎంసీలు ఉన్నాయి. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి యథాతథంగా కొనసాగుతోంది. ఔట్‌ఫ్లో ద్వారా 1,48,734 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్ డ్యామ్ వైపు తరలిస్తున్నారు.
ఈ రోజు శుక్రవారం కావడంతో శనివారం, ఆదివారాల్లో పర్యాటకుల రద్దీ మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, గతంలో పర్యాటకుల తాకిడి వల్ల భారీగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో ఈసారి ట్రాఫిక్ నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
