
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ కీలక పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి, పలు సూచనలు చేశారు.
ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని స్పష్టంగా తెలియజేయడానికి “జీరో ఫేర్ టిక్కెట్” విధానాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. టిక్కెట్‌లో ప్రయాణికురాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో, అసలు టిక్కెట్ ధర ఎంత, అందులో ప్రభుత్వం ఎంత రాయితీ ఇచ్చిందన్న వివరాలు ఉండాలన్నారు. ఇది ప్రజలకు ప్రభుత్వ మద్దతును స్పష్టంగా తెలియజేస్తుందని చెప్పారు. దీనికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను త్వరగా అభివృద్ధి చేయాలని సూచించారు.
సచివాలయంలో సోమవారం జరిగిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో ఈ విధానం ఎలా అమలవుతోందో అధ్యయనం చేయాలని, అంచనా వ్యయాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలన్నది సీఎం తేల్చి చెప్పారు. ఇది మహిళల ఆర్థిక, సామాజిక స్వావలంబనకు దోహదం చేసే చారిత్రాత్మక పథకమని ఆయన అభివర్ణించారు.
మరోవైపు, ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై ఆర్థిక భారం పడకుండా చూసేందుకు, కొత్త ఆదాయ మార్గాలు, నిర్వహణ వ్యయం తగ్గించేందుకు సమర్థ వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సీఎం సూచించారు. సంస్థను లాభదాయక దిశగా నడిపించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాష్ట్రంలో కొనుగోలు చేసే బస్సులు ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలన్నది ఆయన ప్రధాన సూచన. ఇప్పటికే ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇది నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణానికి కూడా మేలు చేస్తుందన్నారు. అవసరమైన విద్యుత్‌ను ప్రభుత్వమే ఉత్పత్తి చేసుకోవాలని, అన్ని ఆర్టీసీ డిపోలలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
