
UPI: దేశవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ఛార్జీలపై సాగుతున్న ప్రచారానికి అధికారిక మార్గదర్శకాలతో తెరపడింది. సామాన్య వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తిగా ఉచితంగా కొనసాగనున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, సాధారణ ప్రజలు జరిపే లావాదేవీలపై ఎలాంటి అదనపు భారం పడదు. అయితే రూ.2,000 దాటిన నిర్దిష్ట వ్యాపార చెల్లింపులపై మాత్రమే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలు కానుంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, ఆర్థికంగా నిలకడగా మార్చేందుకు పలు కీలక నిబంధనలను ఖరారు చేశారు.
* వినియోగదారులకు నో ఛార్జ్: ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి జరిగే బదిలీలు (P2P), అలాగే వ్యాపారులకు చేసే చెల్లింపులు (P2M) రూ.2,000 పరిమితి వరకు ఎలాంటి రుసుము లేకుండా పూర్తిగా ఉచితం.
* చిన్న వ్యాపారులకు రక్షణ: చిన్న స్థాయి దుకాణదారులు, వ్యాపారులకు ఊరటనిస్తూ ‘జీరో MDR’ ప్రయోజనాన్ని యథాతథంగా కొనసాగిస్తున్నారు.
* రూ.2,000 పైబడిన P2Mపై నిబంధనలు: కేవలం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలపైనే 0.4% మేర MDR వర్తిస్తుంది.
* కేటగిరీల వారీగా స్థిర ఛార్జీ: కొన్ని ప్రత్యేక రంగాలకు చెందిన ఎంపిక చేసిన లావాదేవీలపై ప్రతి లావాదేవీకి గరిష్ఠంగా రూ.5 చొప్పున స్థిర MDR వర్తింపజేస్తారు.
* గరిష్ట పరిమితి (MDR Cap): పెద్ద మొత్తంలో సాగే లావాదేవీలపై విధించే MDR గరిష్ఠ పరిమితిని రూ.300 వద్ద స్థిరీకరించారు. అంతకు మించి అదనపు ఛార్జీ పడదు.
సామాన్యుడికి పూర్తి ఊరట
యూపీఐ చెల్లింపులపై అదనపు రుసుములు వస్తున్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన తప్పుడు ప్రచారాలకు ఈ నిబంధనలు గట్టి సమాధానమిచ్చాయి. నిత్యావసర కొనుగోళ్లు, చిన్న వ్యాపారాల వద్ద జరిపే లావాదేవీలు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు పంపే నగదు బదిలీలు పూర్తిగా ఉచిత కేటగిరీలోనే ఉంటాయి. వ్యాపార సంస్థలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు చెల్లించాల్సిన నిర్వహణ రుసుము (MDR)కు, సాధారణ ఖాతాదారుల జేబుకు ఎలాంటి సంబంధం లేదని తేలడంతో వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
