
Dhanush: కోలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు ఒక సంచలన వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. తన వైవిధ్యభరితమైన నటనతో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్ త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీతో యాక్టివ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఏకంగా తమిళనాడు సీఎం అయ్యారు. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రయాణాన్ని ధనుష్ కూడా అనుసరించనున్నారనే చర్చ తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సెగలు రేపుతోంది.
ఈ ఊహాగానాలకు బలం చేకూరుస్తూ తాజాగా ఒక ఆసక్తికరమైన పరిణామం కోలీవుడ్‌లో చోటుచేసుకుంది. ధనుష్ అధికారిక అభిమాన సంఘం ఒక ప్రత్యేక కార్యక్రమంలో వారి సంఘానికి సంబంధించిన అధికారిక జెండాను ఆవిష్కరించింది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని, ప్రజల్లోకి వెళ్లాలని అభిమానులకు పిలుపునిచ్చింది. సాధారణంగా తమిళనాడులో ఏ స్టార్ హీరో అయినా రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలాంటి వ్యూహాలనే అవలంబిస్తారు. దాంతో, ధనుష్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ధనుష్ వచ్చే సార్వత్రిక ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ ప్రచారం ఇంతలా జరుగుతున్నప్పటికీ, దీనిపై హీరో ధనుష్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కనీసం ఖండించనూ లేదు. ప్రస్తుతం ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమాన సంఘాల కదలికలు చూస్తుంటే భవిష్యత్తులో కోలీవుడ్ నుంచి మరో పొలిటికల్ స్టార్ రావడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
