
Akka Trailer: వెండితెరపై ఎప్పుడూ సంప్రదాయ చీరకట్టులో, పక్కింటి పిల్లలా కనిపించే కీర్తి సురేశ్.. ఒక్కసారిగా చేతిలో గన్ పట్టి రౌడీ ముఠాను నడిపించే డాన్‌గా మారిపోతే ఎలా ఉంటుందో ఊహించగలరా? సరిగ్గా అలాంటి పిచ్చెక్కించే వైలెంట్ లుక్‌తో ‘అక్క’ ట్రైలర్ నెట్టింట అడుగుపెట్టింది. బాలీవుడ్ స్టార్ నటి రాధికా ఆప్టే, కీర్తి సురేశ్ ముఖాముఖి తలపడిన ‘అక్క’ వెబ్ సిరీస్ అఫీషియల్ ట్రైలర్‌ను నెట్‌ఫ్లిక్స్ రిలీజ్ చేయగా.. విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ కథ 1985 కాలంలో సాగే ‘పేర్ణూరు’ అనే ఊరి చుట్టూ తిరుగుతుంది. అక్కడ మగవాళ్ల పెత్తనానికి అస్సలు చోటు లేదు. గత 800 ఏళ్లుగా కేవలం ఆడవాళ్ల మాటే శాసనంగా నడుస్తోంది. ఆ సింహాసనంపై కూర్చునే నాయకురాలిని అంతా భయంతో ‘అక్క’ అని పిలుచుకుంటారు. అక్కడ పెళ్లి అనే మాటే వినిపించదు, ఇళ్ల పేర్లు కూడా మహిళల పేర్ల మీదే ఉంటాయి. ఆ ఊళ్లో ఎవరైనా బతకాలన్నా, వ్యాపారాలు చేయాలన్నా అక్క గ్యాంగుకు కమీషన్ ముట్టజెప్పాల్సిందే. ఎదురుతిరిగితే ఎంతటి మగాడినైనా కడతేర్చడం వీళ్లకు లెక్కే కాదు.
అయితే ఎవరికీ తలవంచని ఈ అక్కల సామ్రాజ్యానికి ఎసరు పెట్టేందుకు ‘రుద్ర’ పాత్రలో రాధికా ఆప్టే రంగంలోకి దిగడంతో కథ పీక్స్‌కు చేరింది. అక్కను, ఆమె ముఠాను లేపేయడానికి సుపారీ తీసుకున్న కిల్లర్‌గా రాధికా కనిపించబోతోంది. “ఇది బాంబే కాదు.. ఇక్కడ తుపాకీ బుల్లెట్లతో గొడవలు సర్దుమణగవు, చంపడమే ఒక బిజినెస్” అంటూ రాధికా వేసే డైలాగులు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. “ఆమె ఆడ రూపంలో ఉన్న రాక్షసి.. ఆ రాక్షసిని నేనే అంతం చేస్తా” అంటూ అక్కపై ఆమె చేసే వేట ట్రైలర్‌కు ప్రాణం పోసింది.
యష్‌రాజ్ ఫిలింస్ సమర్పణలో దర్శకుడు ధర్మరాజ్ శెట్టి చెక్కిన ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో.. కీర్తి సురేశ్ చూపించిన తీవ్రమైన విలనిజం, రాధికా ఆప్టేతో నడిచే మైండ్ గేమ్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. అక్టోబర్ 30 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ ఓటీటీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
