
నితిన్ హీరోగా, నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కుతున్న ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ కొత్తగా, ఆసక్తికరంగా ఉంది. 2000వ దశకం నేపథ్యంలో సాగే ఈ కథలో నితిన్ కృష్ణ అనే ఫ్యామిలీ కోర్టు స్టెనో పాత్రలో కనిపిస్తున్నాడు. బయటకు చాలా అమాయకంగా, పద్ధతిగా కనిపించే కృష్ణకు ఓ రహస్యమైన అలవాటు ఉంటుంది. ‘కోరికలే గుర్రాలైతే’ వంటి రొమాంటిక్ పుస్తకాలను తన పేరుతో కాకుండా అమ్మాయి పేరుతో రాస్తుంటాడు. ఈ విషయం ఇంట్లో బయటపడినప్పుడు వచ్చే కామెడీ సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. ముఖ్యంగా పెళ్లిచూపుల సన్నివేశాలు, హీరో హీరోయిన్ మధ్య సంభాషణలు చాలా సహజంగా, సరదాగా అనిపిస్తున్నాయి. నితిన్ పాత సినిమాల్లో కనిపించిన వింటేజ్ కామెడీ టైమింగ్‌ను మరోసారి గుర్తుచేస్తున్నాయి.
ట్రైలర్ మొదట్లో సరదాగా సాగినా, ఆ తర్వాత కథలో ఎమోషనల్ కోణం కూడా ఉందని చూపించారు. ప్రేమ, మనసులోని సంఘర్షణ, ఎడబాటు వంటి అంశాలతో కథను ఆసక్తికరంగా మలిచినట్లు తెలుస్తోంది. చివర్లో నితిన్ చెప్పే ఎమోషనల్ డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. కళ్లద్దాలు, అమాయకమైన లుక్‌తో కృష్ణ పాత్రలో నితిన్ కొత్తగా కనిపిస్తున్నాడు. మురళీ కాంత్ దేవసోత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నాని సమర్పకుడిగా వ్యవహరిస్తుండటం మరో ప్రత్యేకత. మొత్తానికి కామెడీ, ప్రేమ, భావోద్వేగాలను కలిపిన ఓ కొత్త తరహా కథను ప్రేక్షకులకు అందించబోతున్నారనే ఫీలింగ్ ట్రైలర్ కలిగిస్తోంది. డిసెంబర్ 4న విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
