
BKU: మలయాళ చిత్రసీమ బాక్సాఫీస్ చరిత్రలో కనీవినీ ఎరుగని సరికొత్త అధ్యాయం లిఖితమైంది. విడుదలైన కేవలం 24 రోజుల్లోనే కేరళ రాష్ట్ర సినీ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’. కేరళ బాక్సాఫీస్ చరిత్రలోనే ‘ఆల్‌టైమ్ హైయెస్ట్ గ్రాసింగ్ మలయాళ మూవీ’ గా అవతరించి ఇండస్ట్రీ వర్గాల మైండ్ బ్లాంక్ చేసింది. గతంలో ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరోల చిత్రాలు నెలకొల్పిన మైలురాళ్లను అధిగమిస్తూ, ఇంత తక్కువ సమయంలో ఈ ఘనత సాధించడం దక్షిణాది సినీ చరిత్రలోనే ఒక సంచలనంగా మారింది.
కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే మాటకు ఈ సినిమా తిరుగులేని నిదర్శనంగా నిలిచింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా స్వచ్ఛమైన భావోద్వేగాలు, ఆకట్టుకునే కథనంతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. “ప్రేమతో చరిత్రను తిరగరాస్తున్నాం” అంటూ చిత్ర నిర్మాణ సంస్థ స్వయంగా అధికారికంగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో నివిన్ పౌలీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. నివిన్ పౌలీ తనదైన సహజ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయగా, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం, రోజురోజుకూ వసూళ్ల ప్రవాహాన్ని పెంచుకుంటూ పోయింది. విడుదలైన నాలుగో వారంలోనూ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.
ఈ చిత్రంలో యువ కథానాయిక మమితా బైజు, విలక్షణ నటుడు దిలీష్ పోతన్ కీలక పాత్రల్లో జీవించేశారు. భావన స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పించగా, ఫార్స్ ఫిల్మ్ ఓవర్‌సీస్ మార్కెట్‌లో భారీ ఎత్తున విడుదల చేసింది. స్టార్ డమ్ కంటే కంటెంట్ గొప్పదనాన్ని చాటిచెబుతూ కేరళ గడ్డపై ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సాధించిన ఈ ఘనతపై సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
