Site icon TeluguMirchi.com

Chiranjeevi: ‘పెద్ది’ బ్లాక్‌బస్టర్ విజయంపై మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్.. ఒక తండ్రిగా, నటుడిగా గర్వపడుతున్నానంటూ కామెంట్స్!

Chiranjeevi

Chiranjeevi emotional post: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – సంచలన దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా యాక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ నేడు (జూన్ 4, 2026) థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా సాధించిన అఖండ విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ విజయం దగ్గరే ఉందంటూ ఆయన చిత్ర యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఒక తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది!
రామ్ చరణ్ నటనపై చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. “గత రెండేళ్లుగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ నేను దగ్గరుండి చూశాను. ‘పెద్ది’ పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ రోజు ప్రేక్షకులు అందిస్తున్న అఖండ విజయం. చరణ్‌కు దక్కుతున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తోంది” అని చిరంజీవి ట్వీట్ చేశారు.

ఇలాంటి ఒక అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించినందుకు దర్శకుడు బుచ్చిబాబు సానాకు మెగాస్టార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారుకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. ఈ చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరిని చిరంజీవి పేరుపేరునా అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన శివరాజ్‌కుమార్ గారికి, ‘అప్పలసూరి’ పాత్రలో అద్భుతంగా జీవించిన జగపతిబాబును ప్రశంసించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌కు, డీఓపీ రత్నవేలుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హీరోయిన్ జాన్వీ కపూర్, నటుడు దివ్యేందులతో పాటు వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలకు హృదయపూర్వక అభినందనలు అందజేశారు. ప్రస్తుతం ఈ మెగా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version