
Singa: మ్యాచో స్టార్ గోపీచంద్ మునుపెన్నడూ చూడని రీతిలో ఊరమాస్ అవతారంలోకి దిగిపోయారు. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వి.వెంకట్ తొలిసారి దర్శకుడిగా మారి రూపొందిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘సింగ’. 70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తాజాగా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన భారీ ఫారెస్ట్ సెట్‌లో రాత్రింబవళ్లు శ్రమించి అత్యంత కీలకమైన సన్నివేశాలు, ఫైట్ ఎపిసోడ్లను షూట్ చేసిన చిత్ర బృందం, ఈ ప్రాజెక్ట్ సరిగ్గా 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఈ కీలక మైలురాయిని పురస్కరించుకుని విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. చేతిలో పదునైన ఆయుధం పట్టుకుని, దట్టమైన అడవిలోని రాతి గుట్టపై నిలబడి గోపీచంద్ ఇచ్చిన లుక్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. కెరీర్‌లోనే అత్యంత పవర్‌ఫుల్ అండ్ డిఫరెంట్ రోల్‌లో ఆయన కనిపించబోతున్నారని ఈ పోస్టర్ స్పష్టం చేస్తోంది. ఫైట్ మాస్టర్‌గా ఎన్నో సినిమాలకు ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్ డిజైన్ చేసిన వి.వెంకట్ స్వయంగా మెగాఫోన్ పట్టడంతో, ఇందులో యాక్షన్ బ్లాక్స్ వెండితెరపై ఏ స్థాయిలో పేలబోతున్నాయో ఊహించుకోవచ్చు.
ఈ చిత్రంలో అనార్కలి నాజర్ కథానాయికగా నటిస్తుండగా, అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను దడదడలాడించే సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. షామ్‌దత్ విజువల్స్ ఈ ఫారెస్ట్ యాక్షన్ డ్రామాకు ప్రధాన బలంగా మారనున్నాయి. కేవలం రక్తం చిందే ఫైటింగులకే పరిమితం కాకుండా, గుండెలను హత్తుకునే బలమైన భావోద్వేగాలు ఈ కథకు వెన్నెముకగా నిలవనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. హైదరాబాద్ షెడ్యూల్ దిగ్విజయంగా ముగియడంతో, తదుపరి భారీ షెడ్యూల్‌ను డిసెంబర్‌లో మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సగం షూటింగ్ పూర్తి చేసుకుని అడవి బాట పట్టిన గోపీచంద్ ‘సింగ’, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో రికార్డులను వేటాడనుందో చూడాలి.
