
HHVM Story : పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రంగా రూపొందిన ‘హరి హర వీరమల్లు’ సనాతన ధర్మాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన కల్పిత కథ. తెలంగాణకు చెందిన ఓ యధార్థ వ్యక్తి జీవిత కథ అని మొదట ప్రచారం జరిగినా, దాని వెనుక వాస్తవం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ‘హరి హర వీరమల్లు’ కథ పూర్తిగా మారిపోయింది. దర్శకుడు కథలోని స్ఫూర్తిని, సారాన్ని అలాగే ఉంచుతూ.. సరికొత్త కథగా దీనిని మలిచారు.
పురాణాల ప్రకారం, అయ్యప్ప స్వామిని శివుడు-మోహినిల కుమారుడిగా, శైవం మరియు వైష్ణవం మధ్య వారధిగా ఎలా వర్ణిస్తారో.. అలాగే ‘హరి హర వీరమల్లు’ను శివుడు మరియు విష్ణువుల అవతారంగా చూడబోతున్నాం. సరిగ్గా గమనిస్తే, హరి(విష్ణు) హర(శివుడు) అనే టైటిల్ ఈ చిత్ర సారాంశాన్ని తెలియజేస్తుంది. శివుడు, విష్ణువుల అవతారం ‘వీరమల్లు’ అని తెలిపేలా ఈ చిత్రంలో పలు అంశాలను గమనించవచ్చు. విష్ణువు వాహనం గరుడ పక్షిని సూచించే డేగను ఈ చిత్రంలో ఉపయోగించారు. అలాగే, కథానాయకుడు తన చేతుల్లో శివుడిని సూచించే డమరుకం పట్టుకున్నాడు. ఈ చిత్రంలో కథానాయకుడు ధర్మాన్ని రక్షించడానికి మరియు ధర్మం కోసం పోరాడటానికి శివుడు, విష్ణువుల యొక్క రూపంగా కనిపిస్తాడు.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఆసక్తి పెరిగి, పంపిణీ హక్కులకు భారీ డిమాండ్ వచ్చి చేరింది. నిర్మాత ఎ.ఎం. రత్నం ఈ సినిమాను అత్యధిక బడ్జెట్‌తో నిర్మించడంతో పాటు, కొన్ని ప్రాంతీయ రైట్స్ ను మాత్రమే విడుదల చేశాడు. జూలై 24న ‘హరి హర వీరమల్లు’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో ప్రేక్షకుల్లో ఈ చిత్రాన్ని చూసేందుకు తీవ్ర ఉత్సుకత నెలకొంది.
