Site icon TeluguMirchi.com

Irumudi: ‘ఇరుముడి’ కథ విని ‘స్టాప్ ఇట్ సర్.. నేను థియేటర్‌లో చూడలేను’.. అంటూ రవితేజ కూతురు ఏడ్చేసింది: శివ నిర్వాణ

Shiva Nirvana revealed

Irumudi: మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు శివ నిర్వాణ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా సినిమా కథను రవితేజ కుమార్తె మోక్షకు వినిపించినప్పుడు జరిగిన ఓ ఎమోషనల్ సంఘటనను ఆయన వెల్లడించారు. ‘ఇరుముడి’ కథ చర్చల దశలో ఉన్న సమయంలో రవితేజ కుమార్తె మోక్ష స్వయంగా సినిమా కార్యాలయానికి వచ్చి కథ విన్నారని శివ నిర్వాణ తెలిపారు. మోక్ష మోడ్రన్ మైండ్‌సెట్ ఉన్న అమ్మాయి కావడంతో కథను ఆమె ఎలా స్వీకరిస్తారో మొదట తనకు ఆసక్తిగా అనిపించిందని చెప్పారు. అయితే కథ నరేషన్ సమయంలో మోక్ష తన తండ్రి రవితేజను సినిమాలోని పాత్రలో ఊహించుకుని విన్నారని శివ తెలిపారు. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే ఓ కీలకమైన ఎమోషనల్ సన్నివేశాన్ని వివరిస్తున్న సమయంలో ఆమె తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారని చెప్పారు. కథ వింటూనే మోక్ష గొంతు పూడుకుపోయి, కళ్ల వెంట నీళ్లు వచ్చాయని శివ నిర్వాణ గుర్తుచేసుకున్నారు. చివరకు తన చేతులు పట్టుకుని “స్టాప్ ఇట్ సర్.. ఇది నేను థియేటర్‌లో చూడలేను” అంటూ ఏడ్చేశారని తెలిపారు. ఎడిటింగ్ రూమ్‌లో కూడా ఆమె ఈ సినిమాను చూడలేదని, ఇటీవలే సినిమా చూశారని దర్శకుడు వెల్లడించారు.

‘ఇరుముడి’లో రవితేజ హీరోయిజం కంటే పాత్రలోని నిజాయితీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని శివ నిర్వాణ చెప్పారు. ఇంటర్వెల్‌కు ముందు సాధారణ విలన్ చేతిలో రవితేజ దెబ్బలు తినే సన్నివేశాన్ని రాసినప్పుడు.. అభిమానులు ఎలా స్పందిస్తారనే ఆలోచన చేయకుండా రవితేజ కథకు పూర్తిగా అంగీకరించారని తెలిపారు. అంతేకాదు, సినిమాలో అయ్యప్ప స్వామి భిక్ష సన్నివేశాల కోసం షర్ట్ విప్పేందుకు కూడా రవితేజ ఏమాత్రం వెనుకాడలేదని శివ నిర్వాణ పేర్కొన్నారు. కథకు అవసరమైన చోట హీరోయిజాన్ని పక్కన పెట్టి పాత్రకు అనుగుణంగా నటించేందుకు రవితేజ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘ఇరుముడి’ కథను మొదట విన్న వారిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ గారు, రవితేజ మేనేజర్ శ్రీనివాసరాజు కూడా ఉన్నారని శివ నిర్వాణ తెలిపారు. కథ వింటున్న సమయంలో వారిద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు. కథలో ఉన్న బలమైన ఎమోషన్‌నే ‘ఇరుముడి’ విజయానికి ప్రధాన కారణంగా శివ నిర్వాణ అభివర్ణించారు. ప్రేక్షకులను కూడా అదే భావోద్వేగం కనెక్ట్ చేసిందని పేర్కొన్నారు. సక్సెస్ మీట్‌లో దర్శకుడు వెల్లడించిన ఈ విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి.

Exit mobile version