Site icon TeluguMirchi.com

Naga Vamsi: తారక్ కోసమేనా ఆ సాహసం.. ‘జైలర్ 2’ డీల్‌పై నాగవంశీ ఓపెన్ టాక్!

Naga Vamsi

Naga Vamsi: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నెక్ట్స్ లైనప్ గురించి వస్తున్న వార్తలు రోజురోజుకూ మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. దేవర తర్వాత వరుసగా బడా ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్న తారక్ లైనప్‌లో.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ పేరు చాలా రోజులుగా గట్టిగా వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారనే టాక్ కూడా సినీ వర్గాల్లో ఇప్పటికే ఉంది. అయితే, తాజాగా ‘జైలర్ 2’ ప్రెస్‌మీట్‌లో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చడమే కాకుండా, ఆయన వేసిన ముందస్తు వ్యూహాన్ని తేటతెల్లం చేశాయి. రజినీకాంత్ ‘జైలర్ 2’ తెలుగు హక్కులను నాగవంశీ ఊహించని భారీ రేటుకు కొనుగోలు చేసి పెద్ద సాహసమే చేశారు.

అంత హై-రిస్క్ రేట్ పెట్టి ఈ సినిమాను దక్కించుకోవడానికి బలమైన కారణం దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమారేనని ఆయన స్వయంగా స్పష్టం చేశారు. నెల్సన్‌తో తాము సినిమా చేయబోతున్నామని, భవిష్యత్తులో తమ బ్యానర్‌లో చేయబోయే దర్శకుడి సినిమా విడుదలవుతున్నప్పుడు ఆయనపై నమ్మకంతో రిస్క్ చేయడంలో తప్పేముందని నాగవంశీ కుండబద్దలు కొట్టారు. దీనికితోడు రజినీకాంత్, నెల్సన్, అనిరుధ్ కాంబోపై ఉన్న అపారమైన నమ్మకమే ఆ నిర్ణయానికి కారణమని తెలిపారు.

నాగవంశీ చేసిన ఈ వ్యాఖ్యలతో పరిశ్రమలో ఓ ఆసక్తికరమైన చర్చకు తెరలేచింది. నెల్సన్‌తో సితార నిర్మించబోయే ఆ భారీ చిత్రం మరెవరితోనో కాదు.. జూనియర్ ఎన్టీఆర్‌తోనేనని దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. ఇప్పటికే వీరి మధ్య కథకు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు నెల్సన్ మార్క్ డార్క్ కామెడీ, స్టైలిష్ యాక్షన్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర మరో స్థాయి ఊచకోత ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. నెల్సన్‌ను తెలుగు మార్కెట్‌కు పక్కాగా లాక్ చేయడానికే ‘జైలర్ 2’ బిజినెస్‌ను నాగవంశీ పావుగా వాడుకున్నారని స్పష్టమవుతోంది. త్వరలోనే ఎన్టీఆర్ – నెల్సన్ – నాగవంశీ క్రేజీ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉండటంతో నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది.

Exit mobile version