
Jason Sanjay: తమిళ స్టార్ హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ త్వరలో దర్శకుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ‘సిగ్మా’ చిత్రంతో డైరెక్టర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్న ఆయన.. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలతోనూ అప్పుడప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు, చెల్లెలితో ఉన్న అనుబంధం గురించి జాసన్ సంజయ్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన తల్లి సంగీత తన జీవితంలో ఎంతో కీలకమైన వ్యక్తి అని జాసన్ సంజయ్ తెలిపారు. తనతో పాటు చెల్లెలి గురించి కూడా ఆమె ఎప్పుడూ ఆలోచిస్తుంటారని చెప్పారు. తాను ఏదైనా రోజు అమ్మకి ఫోన్ చేయడం మర్చిపోయినా.. ఆమె స్వయంగా ఫోన్ చేసి తన యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారని పేర్కొన్నారు. తన తల్లి ప్రేమ, శ్రద్ధ తనకు ఎంతో ప్రత్యేకమని జాసన్ వెల్లడించారు.
అయితే తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని స్వేచ్ఛగా పంచుకోవడంలో కొంత సంకోచం ఉంటుందని ఆయన చెప్పడం ఆసక్తికరంగా మారింది. తల్లిదండ్రులు తనకు చాలా విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ.. ప్రతి విషయాన్ని వారితో ఓపెన్‌గా మాట్లాడేంత స్పేస్ తనకు లేదని జాసన్ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో తన చెల్లెలితో మాత్రం ఎలాంటి దాపరికం లేకుండా మాట్లాడుతానని తెలిపారు. తన జీవితంలో జరిగే చిన్న విషయాల నుంచి ముఖ్యమైన అంశాల వరకు ప్రతి విషయాన్ని చెల్లెలితో స్వేచ్ఛగా పంచుకుంటానని చెప్పారు. ఆమెతో మాట్లాడేటప్పుడు తనలో ఎలాంటి భయం, సంకోచం ఉండదని వెల్లడించారు. తన తల్లి తన జీవితానికి పెద్ద అండగా నిలుస్తున్నారని చెప్పిన జాసన్.. చెల్లెలితో తనకున్న సాన్నిహిత్యాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించడం ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తండ్రి విజయ్‌తో పోలిస్తే తల్లిపై తనకున్న అనుబంధాన్ని జాసన్ ఎక్కువగా ప్రస్తావించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇక జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరకెక్కించనున్న ‘సిగ్మా’ చిత్రంపై కూడా ఆసక్తి నెలకొంది. విజయ్ వారసుడిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని భావిస్తున్న జాసన్.. దర్శకత్వంలో ఎలాంటి మార్క్ చూపిస్తారో చూడాలి.
