
Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెండితెరపైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తనను ఎందుకు అభిమానులు అంతలా అభిమానిస్తారో మరోసారి నిరూపించారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన ఒక సరదా సంభాషణను సీరియస్‌గా తీసుకుని, తన అభిమాని కుటుంబానికి మర్చిపోలేని ఒక మధురమైన జ్ఞాపకాన్ని అందించారు తారక్. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఎన్టీఆర్ తాను స్వయంగా ఇంట్లో బేక్ చేసిన చాక్లెట్ చిప్ కుకీస్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. “నా మొదటి బేకింగ్.. కొన్నవి కావు, నేనే చేశా” (#BakedNotBought) అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్‌ను చూసిన సాయితేజ అనే ఓ అభిమాని ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ.. “అన్నా.. మా ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. మా కోసం రెండు కుకీలు పంపించవా?” అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
దీనికి తారక్ తన మార్క్ హ్యుమర్‌ను జోడిస్తూ, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం పాపులర్ మీమ్ డైలాగ్ “అడ్రస్ పెట్టు.. ఫాస్ట్‌గా అడ్రస్ పెట్టు” వీడియో క్లిప్‌ను రిప్లైగా ఇచ్చి నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తారు. అందరూ అది కేవలం సరదా మీమ్ రిప్లై మాత్రమే అనుకున్నారు. కానీ, యంగ్ టైగర్ ఆ అభిమాని అడ్రస్ కనుక్కుని, నిజంగానే తాను స్వయంగా తయారుచేసిన కుకీస్ బాక్స్‌ను ఆటోగ్రాఫ్‌తో సహా ఆ అభిమాని ఇంటికి పంపించారు. ఈ ఊహించని సర్ప్రైజ్‌కు షాక్ అయిన సదరు అభిమాని, తన పిల్లలు ఆ కుకీస్ తింటున్న వీడియోలను షేర్ చేస్తూ.. “క్యాజువల్‌గా చేసిన కామెంట్ ఇంత స్వీట్ సర్ప్రైజ్‌గా మారుతుందని అనుకోలేదు. పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు, ఆటోగ్రాఫ్ చూసి నా ఆనందానికి అవధులు లేవు. ఇంటర్నెట్ కేవలం సందడి కోసమే కాదు, ఇలాంటి మంచి జ్ఞాపకాలకు కూడా ఒక వంతెనలా మారుతుందని ఇప్పుడే తెలిసింది. థాంక్యూ తారక్ అన్నా” అంటూ ఎమోషనల్ నోట్ రాశారు.
ట్వీట్ల పరంపర ఇక్కడితో ఆగలేదు. ఇండస్ట్రీలో వంటల్లో (ముఖ్యంగా బిర్యానీ, నాటుకోడి వండడంలో) ఎన్టీఆర్ దిట్ట అనే విషయం అందరికీ తెలిసిందే. దాంతో మరో నెటిజన్.. “బిర్యానీ వండే టైగర్ కుకీస్ చేయడం ఏంటి?” అని ప్రశ్నించగా, దానికి తారక్ ‘బాద్‌షా’ సినిమాలోని బ్రహ్మానందం డైలాగ్ “మారాయి.. అన్నీ మారాయి” క్లిప్‌ను షేర్ చేసి తన కామెడీ టైమింగ్‌తో నెటిజన్లను ఫిదా చేశారు. అభిమానులను కేవలం ఫ్యాన్స్‌లా కాకుండా తన కుటుంబ సభ్యుల్లా చూసుకునే మనసు తారక్‌కు మాత్రమే ఉందని కామెంట్స్ చేస్తూ.. నందమూరి అభిమానులు ఈ ట్వీట్లను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
