
Killer Movie Accident: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వైవిధ్యభరితమైన పాత్రలతో తమిళంతో పాటు తెలుగులో కూడా అభిమానులను సొంత చేసుకున్న నటుడు నటుడు ఎస్.జె.సూర్య. ప్రస్తుతం ఆయన హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కిల్లర్’. అయితే ఈ చిత్ర షూటింగ్ సెట్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన గ్యాస్ సిలిండర్ పేలుడులో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నైలోని ప్రసిద్ధ బిన్నీ మిల్స్‌లో ఈ ఘోర ప్రమాదం సంభవించింది.
అసలేం జరిగిందంటే..
చిత్ర యూనిట్ కథనం ప్రకారం.. బిన్నీ మిల్స్‌లో గత రాత్రి నుంచి ఒక హై – వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌ను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక భారీ ‘ఫైర్ సీన్’ ప్లాన్ చేశారు. ఫైర్ ఎఫెక్ట్స్ కారణంగా సెట్స్‌కు భారీగా గ్యాస్ సిలిండర్లను తీసుకువచ్చారు. అయితే ఒక సిలిండర్‌లోకి గ్యాస్ నింపుతున్న సమయంలో ఊహించని విధంగా లీకేజీ ఏర్పడింది. గ్యాస్ వేగంగా లీక్ అవ్వడంతో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాద తీవ్రతకు సెట్‌లో పనిచేస్తున్న ఒక టెక్నీషియన్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ సభ్యులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సినిమా సెట్స్‌లో కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు మరోసారి చిత్ర పరిశ్రమలో గుప్పుమంటున్నాయి.
