
Nani: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో నాని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. సాధారణంగా స్టార్ హీరోలు తమ సినిమాల్లోని క్రెడిట్ అంతా తమ ఖాతాలోనే వేసుకోవడానికి చూస్తారు. కానీ నాని మాత్రం ఇందుకు భిన్నంగా, “ది ప్యారడైజ్ కేవలం హీరో సినిమా కానే కాదు.. ఈ చిత్రానికి నేనసలు హీరోనే కాను” అంటూ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ వేదికపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పాత్రను ప్రస్తావిస్తూ నాని అత్యంత ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “కొన్ని చిత్రాలకు ‘దర్శకత్వ పర్యవేక్షణ’ అని వేస్తారు.. అంటే దర్శకుడిపై ఇంకొక పెద్ద దర్శకుడు ఉన్నట్టు. అలాగే ఈ సినిమాకి కూడా హీరో ఉన్నాడు.. కానీ ఆ హీరో పైనున్న అసలైన హీరో మాత్రం మోహన్ బాబు గారే” అని నాని కుండబద్దలు కొట్టారు.
రఫ్ ఎడిట్ చూస్తున్నప్పుడు మోహన్ బాబు పాత్రకు వేరొకరితో డబ్బింగ్ చెప్పించి చూపించారని, ఆ సమయంలో మోహన్ బాబు ముఖంపై మరో గొంతును అసలు ఊహించలేకపోయానని నాని గుర్తుచేసుకున్నారు. “ఆయన గొంతుతో చెవులు తుప్పు వదిలిపోయేలా ఒక్క డైలాగ్ పడితేనే థియేటర్‌లో ఆ హై, ఆ కిక్ వస్తుంది. తెరపై ఆయన కటౌట్, వాయిస్ ముందు ఇంకెవరూ సరిపోరు” అని స్పష్టం చేశారు. బయట సమాజంలో మోహన్ బాబు చాలా స్ట్రిక్ట్, కోపిష్టి అనే ఓ ముద్ర ఉందని, కానీ ఆయనతో కలిసి పనిచేసిన తర్వాతే ఆయనలోని అసలైన వ్యక్తిత్వం అర్థమైందని నాని అన్నారు. “మోహన్ బాబు గారు బయటికి కనిపించేంత కఠినమైన మనిషి కాదు. ఆయనలోని ఆ ప్రేమ, ఆప్యాయత బయటకు వస్తే ఎక్కడ అందరూ ఆయనతో ప్రేమలో పడిపోతారోనని భయంతోనే ఆ మంచిదనాన్ని దాచిపెడుతుంటారు. ఆయన ఒక్కసారి సొంతం చేసుకుంటే కురిపించే ప్రేమను ఎవరూ తట్టుకోలేరు” అంటూ సినిమా రిలీజ్ తర్వాత మోహన్ బాబు తన ఇంటికి పండ్లను, బహుమతులను పంపిన విషయాన్ని ఎమోషనల్‌గా గుర్తుచేసుకున్నారు.
సినిమా రిలీజ్ రోజు పరిస్థితులపై కూడా నాని నిర్మొహమాటంగా స్పందించారు. “ఈ రోజుల్లో ఉదయం పాజిటివ్‌గా మొదలై, సాయంత్రానికి నెగెటివ్ టాక్ తెచ్చుకునే సినిమాలు ఎన్నో చూశాం. కానీ ప్యారడైజ్ విషయంలో విచిత్రంగా రివర్స్ జరిగింది. ప్రీమియర్స్ నైట్ ఒకరకమైన మిశ్రమ స్పందనతో మొదలైనప్పటికీ, షో షోకి పాజిటివిటీ ఊహించని రేంజ్‌లో పెరిగింది. ఇది కేవలం హీరో వల్ల సాధ్యం కాలేదు. వర్షంలో, బ్లడ్‌లో తడుస్తూ రాత్రింబవళ్లు పనిచేసిన చిన్న నటులు, టెక్నీషియన్లు, అసిస్టెంట్ డైరెక్టర్ల రక్తం ఇందులో ఉంది. వారే ఈ సినిమాకు నిజమైన హీరోలు” అని తన చిత్ర బృందాన్ని ఆకాశానికెత్తారు. మొత్తానికి, ‘ది ప్యారడైజ్’ చుట్టూ వచ్చిన అన్ని రకాల చర్చలను అధిగమించి, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేయడంలో టీమ్ కష్టం ఫలించిందని నాని అన్నారు. నాని చేసిన ఈ కామెంట్స్, ముఖ్యంగా మోహన్ బాబుపై ఆయన వ్యక్తం చేసిన గౌరవం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
