Site icon TeluguMirchi.com

Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. అక్కడే ఉంటా: నరేష్

Naresh

Naresh: “సినిమా బాగోలేకపోతే రండి తేల్చుకుందాం.. నేను గచ్చిబౌలిలోనే ఉంటా!” ప్రముఖ సీనియర్ నటుడు నరేష్ విసిరిన ఓపెన్ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సాధారణంగా తమ సినిమా బాగుంటుందని నటీనటులు ప్రమోషన్లలో చెప్పడం సహజం. కానీ, ఏకంగా సినిమా నచ్చకపోతే తన ఆఫీస్‌కు వచ్చి నిలదీయవచ్చంటూ ధైర్యంగా సవాల్ విసరడం హాట్ టాపిక్‌గా నిలిచింది. ‘క్రేజీ కళ్యాణం’ ట్రైలర్ లాంచ్ వేదికగా నవరస రాయ నరేష్ చేసిన ఈ కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్నాయి. అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాపై ఆయన వ్యక్తం చేసిన నమ్మకం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ.. “నా సుదీర్ఘ సినీ ప్రయాణంలో దాదాపు 300 సినిమాలు చేశాను. వాటన్నింటిలోనూ ‘క్రేజీ కళ్యాణం’లో చేసిన పాత్రే నా కెరీర్ బెస్ట్. ఇంతకంటే మంచి క్యారెక్టర్ భవిష్యత్తులో మళ్లీ దొరుకుతుందా లేదా అని ఆలోచించేలా ఈ పాత్ర ఉంటుంది. ప్రతి పాత్రకు జీవం పోసి దర్శకుడు ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు” అని కొనియాడారు. నేటి రోజుల్లో టికెట్ రేట్లు పెరిగిపోవడంతో పాటు ప్రేక్షకుల సమయం ఎంతో విలువైందని గుర్తుచేసిన నరేష్, ప్రేక్షకులను మోసం చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. “ఇందులో ఎలాంటి హింస, రక్తపాతం, అనవసరపు స్లో-మోషన్లు ఉండవు. అంతా స్వచ్ఛమైన హాస్యం, భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ రోలర్ కోస్టర్. సంక్రాంతికి ‘శతమానం భవతి’ ఎలాంటి విజయం సాధించిందో.. ఈ దసరాకు ‘క్రేజీ కళ్యాణం’ కూడా అంతే పెద్ద గన్‌షాట్ హిట్ కొట్టబోతోంది. 6 ఏళ్ల చిన్నారి నుంచి 66 ఏళ్ల వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరూ కడుపుబ్బా నవ్వుకునేలా ఈ సినిమా ఉంటుంది” అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ సినిమా ఫలితంపై పూర్తి నమ్మకంతో ఉన్న నరేష్, ప్రేక్షకులకు ఊహించని సవాల్ విసిరారు. “ఇది కొంచెం రిస్క్ అని తెలిసినా పూర్తి కాన్ఫిడెన్స్‌తో చెబుతున్నా. థియేటర్‌కు వెళ్లి సినిమా చూశాక ఎవరికైనా నచ్చకపోతే.. గచ్చిబౌలిలోని విజయ కృష్ణ టవర్స్‌కు రండి. నేను, మా చిత్ర బృందం అక్కడే ఉంటాం. సినిమా ఎందుకు నచ్చలేదో నేరుగా మా ముఖం మీదే చెప్పొచ్చు. మాకు ఎలాంటి భయం లేదు, అక్కడే ఎదురుచూస్తాం” అంటూ నరేష్ చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీశాయి. ప్రస్తుతం ప్రమోషన్లతో జోరు పెంచిన ‘క్రేజీ కళ్యాణం’ చిత్రం అక్టోబర్ 15 నుంచే ప్రీమియర్లతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. మరి నరేష్ ఇంత నమ్మకంగా విసిరిన ఈ సవాల్ వెనుక ఉన్న సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Exit mobile version