Site icon TeluguMirchi.com

NTR-Trivikram: ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాను ఆపేయాలి: NTK అధినేత సీమాన్

NTR Trivikram

NTR-Trivikram: స్టార్ హీరో ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఒక సరికొత్త సినిమా అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుబ్రహ్మణ్యస్వామి కథతో చిత్రీకరించనున్నారని సమాచారం. అయితే తాజాగా ఈ చిత్రంపై తమిళనాడుకు చెందిన ‘నామ్ తమిళర్ కట్చి’ (NTK) పార్టీ అధినేత సీమాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాను వెంటనే ఆపేయాలని ఆయన చిత్ర యూనిట్‌ను హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, సినిమాలో చూపించే కొన్ని అంశాలు తమిళ ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు.

తమిళ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచే వారి ఇష్ట దైవం ‘మురుగన్’ (సుబ్రహ్మణ్యస్వామి)ను ఈ చిత్రంలో ఉత్తరాంధ్ర దైవంగా చిత్రీకరించడంపై సీమాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సుబ్రహ్మణ్యస్వామి కేవలం తమిళనాడుకే చెందిన దైవమని, ఆయనకు సంబంధించిన చరిత్ర, సంస్కృతి అంతా తమిళ గడ్డతోనే ముడిపడి ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. అలాంటి దైవాన్ని వేరే ప్రాంతానికి చెందినవాడిగా చూపించడం తమిళ సంస్కృతిని, సంప్రదాయాలను అవమానించడమే అవుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోట్లాది మంది తమిళుల సెంటిమెంట్లతో ఆడుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని సీమాన్ హెచ్చరించారు. వివాదాస్పదమైన ఈ కథాంశంతో సినిమాను ముందుకు తీసుకెళ్లడం సరికాదని ఆయన హితవు పలికారు. చిత్ర యూనిట్ తక్షణమే స్పందించి ఈ సినిమా నిర్మాణాన్ని ఆపేయాలని, లేకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ వివాదం ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

Exit mobile version