
Rashmika Mandanna: టాలీవుడ్ సెన్సేషనల్ జోడీ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నాటి నుంచి వీరి గురించిన ప్రతి చిన్న వార్తా కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ క్రమంలోనే మాతృత్వం, భవిష్యత్తులో తనకు పుట్టబోయే పిల్లల గురించి గతంలో రష్మిక చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ సందర్భంలో పిల్లల పెంపకం గురించి మాట్లాడిన రష్మిక.. తనలోని తల్లి ప్రేమను బయటపెట్టారు. ‘‘నేను ఇంకా అమ్మను కాలేదు. కానీ నాకు పుట్టబోయే పిల్లలపై నాలో ఇప్పటి నుంచే మాటల్లో చెప్పలేనంత బలమైన బంధం, అనురాగం ఏర్పడ్డాయి. నా పిల్లల రక్షణే నాకు సర్వస్వం. వారి క్షేమం కోసం ఎంతటి కఠినమైన పరిస్థితినైనా ఎదుర్కొంటా, అవసరమైతే ఏకంగా యుద్ధం చేయడానికైనా వెనకాడను. వారి కోసమే నా ఆరోగ్యాన్ని, శారీరక దృఢత్వాన్ని ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటాను’’ అంటూ రష్మిక ఎంతో ఎమోషనల్‌గా చెప్పుకొచ్చారు.
స్టార్ హీరోయిన్‌గా ఎంతో బిజీగా కనిపించే రష్మిక.. పిల్లల ప్రస్తావన వచ్చేసరికి ఓ ఫైటర్‌గా ‘యుద్ధానికైనా సిద్ధం’ అని చేసిన ఈ కామెంట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే సమయంలో కెరీర్, వ్యక్తిగత జీవితాల బ్యాలెన్స్‌పై కూడా ఆమె స్పష్టమైన వైఖరిని ప్రదర్శించారు. 20 నుంచి 30 ఏళ్ల వయసులో యువతులు వృత్తిపరంగా ఎదిగి, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడటం అత్యంత కీలకమని రష్మిక అభిప్రాయపడ్డారు. మహిళలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉన్నప్పుడే జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరని, ఆ తర్వాతే సంసార జీవితాన్ని చక్కదిద్దుకోవడం సులువవుతుందని వివరించారు. వివాహానంతరం ఈ స్టార్ కపుల్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు.
