Site icon TeluguMirchi.com

Sreekanth Odela: 3 నెలలు రెస్ట్ తర్వాతే చిరు ప్రాజెక్ట్ అంటున్న శ్రీకాంత్ ఓదెల!

3 Months Rest

Sreekanth Odela: టాలీవుడ్‌లో ఎంతటి స్టార్ డైరెక్టర్‌కైనా మెగాస్టార్ చిరంజీవి డేట్స్ దొరికితే అంతకంటే పెద్ద అదృష్టం మరొకటి ఉండదు. ప్రాజెక్ట్ ఖరారైన వెంటనే క్షణం కూడా తీరిక లేకుండా ప్రీ-ప్రొడక్షన్ పరుగులు పెట్టిస్తారు. కానీ, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల రూటే వేరు. సహజత్వంతో కూడిన రా అండ్ రస్టిక్ కథలతో సినీ ప్రియులను కట్టిపడేసే ఈ యువ దర్శకుడు.. చిరంజీవి సినిమా విషయంలో చేసిన తాజా వ్యాఖ్యలు ఫిలింనగర్ సర్కిల్స్‌లో పెను దుమారానికి తెరలేపాయి. నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మెగా ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ పూర్తి కాగానే వెంటనే చిరంజీవి ప్రాజెక్ట్ మొదలవుతుందని అభిమానులు భావించారు. కానీ దీనిపై శ్రీకాంత్ ఓదెల పూర్తి భిన్నమైన క్లారిటీ ఇచ్చారు. “‘ది ప్యారడైజ్’ విడుదలైన వెంటనే నేను ఏ సినిమా సెట్ మీదికీ వెళ్లను. నా మెదడుకు పూర్తి విశ్రాంతి అవసరం. దాదాపు మూడు నెలల పాటు ఇంట్లోనే ఖాళీగా ఉంటూ రెస్ట్ తీసుకుంటాను” అని ఆయన నిర్మొహమాటంగా స్పష్టం చేశారు. ఈ లెవెల్ కమిట్‌మెంట్‌తో చిరు సినిమాను కొన్నాళ్ల పాటు పక్కన పెట్టేస్తున్నానని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

శ్రీకాంత్ ఓదెల ఇంతటితో ఆగకుండా చేసిన మరో కామెంట్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. “నాకు 3 నెలల బ్రేక్ కావాలనే విషయాన్ని స్వయంగా చిరంజీవి గారికే ముందే చెప్పాను. ఆ మూడు నెలలు ఆయన నా కోసం వేచి చూస్తారా లేక ఈ గ్యాప్‌లో వేరే సినిమా పూర్తి చేసుకుంటారా అనేది పూర్తిగా ఆయన ఇష్టం” అంటూ దర్శకుడు కుండబద్దలు కొట్టారు. ఆ విరామం పూర్తయ్యాక మాత్రమే చిరు ప్రాజెక్ట్ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతానని, అయితే ఈ సినిమా మాత్రం నూటికి నూరు శాతం కచ్చితంగా ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తన దృష్టంతా ‘ది ప్యారడైజ్’ విడుదలపైనే ఉందని ఆయన తేల్చి చెప్పారు. నాని మార్క్ విశ్వరూపం ఈ చిత్రంలో కనిపిస్తుందని, మరోవైపు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మునుపెన్నడూ చూడని అత్యంత భిన్నమైన రోల్‌లో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నారని శ్రీకాంత్ రివీల్ చేశారు. చేతిలో మెగాస్టార్ సినిమా ఉన్నా ఏమాత్రం తొందరపడకుండా, తన నిబంధనల ప్రకారమే సినిమాలు తీస్తానని శ్రీకాంత్ చెబుతున్న తీరు ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ టాపిక్‌గా మారింది.

Exit mobile version