Srikanth Odela: సినిమాపై ఇంత పిచ్చి ఉంటుందా? సుకుమార్ శిష్యుడిగా మారడం వెనుక శ్రీకాంత్ ఓదెల స్ట్రగుల్!

Srikanth Odela

Srikanth Odela: సినిమా ఇండస్ట్రీలో నెగ్గాలంటే కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు.. గమ్యాన్ని చేరుకునే వరకు అలుపెరగని ఓపిక, పిచ్చి ప్యాషన్ ఉండాలి. ఆ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు ‘దసరా’, ది ప్యారడైజ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. నిజంగా ఆయన ప్రయాణం ఎందరో సినిమా ప్రేమికులకు ఆదర్శంగా నిలుస్తుంది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరడం కోసం ఆయన పడ్డ తపన, నిరీక్షణ తన సినీ జర్నీలో చాలా స్పెషల్‌గా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

తన సినీ ప్రయాణం తొలినాళ్లలో సుకుమార్ వద్ద ఎలాగైనా శిష్యరికం చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ అప్పట్లో హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉండేవారు. ఆయన దృష్టిలో పడేందుకు శ్రీకాంత్ ఎంచుకున్న మార్గం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్నే సరిగ్గా 5 గంటలకల్లా ఆ అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకుని కిందే కూర్చునేవారు. సుకుమార్ రాత్రంతా రైటింగ్ వర్క్ పూర్తిచేసుకుని అర్ధరాత్రి ఒంటిగంట లేదా రెండు గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేవారు. ఉదయం ఆయన కనిపించగానే కేవలం “గుడ్ మార్నింగ్ సార్.. గుడ్ నైట్ సార్” అని విషెస్ చెప్పి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయేవారు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇది ఒక వారం లేదా పది రోజుల ముచ్చట కాదు. ఏకంగా మూడేళ్ల పాటు రోజు తప్పకుండా ఈ తంతు కొనసాగింది. వారిద్దరి మధ్య సంభాషణ కేవలం ఆ రెండు మాటలకే పరిమితం. చివరకు మూడో ఏడాదిలోకి అడుగుపెట్టిన తర్వాత.. రోజూ ఉదయాన్నే కనిపిస్తున్న తనను చూసి సుకుమార్ ఆశ్చర్యపోయి నేరుగా తన దగ్గరకు వచ్చి.. “అసలు ఎవర్రా నువ్వు? ఏంటి నీ ప్రాబ్లమ్? ఏందిరా నీ గోల?” అని అడిగారని శ్రీకాంత్ ఓదెల నవ్వుతూ చెప్పుకొచ్చారు.

ఆ క్షణం కోసమే మూడేళ్ల పాటు ఓపిగ్గా వేచి చూసిన తాను .. సినిమాలపై తనకున్న పిచ్చిని, సుకుమార్ వద్దే డైరెక్షన్ నేర్చుకోవాలన్న బలమైన కోరికను ఆయనకు వివరించినట్లు చెప్పారు. శ్రీకాంత్ కళ్లలోని కమిట్‌మెంట్‌ను గుర్తించిన సుకుమార్, ఆయనను తన డైరెక్షన్ టీమ్‌లోకి పరీక్ష పెట్టి జాయిన్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. లక్ష్యం కోసం ఎంచుకున్న మార్గంలో ఎంతటి కష్టాన్నైనా భరిస్తే ఫలితం తప్పక దక్కుతుందని శ్రీకాంత్ ఓదెల జీవిత కథ రుజువు చేస్తోంది సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.