
Srinidhi Shetty: ‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రీనిధి శెట్టి తాజాగా ‘రామాయణ’ సినిమాలో సీత పాత్రకు సంబంధించిన వార్తలపై స్పందించారు. తాను ఆ పాత్రను తిరస్కరించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో శ్రీనిధి శెట్టి మాట్లాడుతూ.. ‘రామాయణ’ చిత్రంలో సీత పాత్ర కోసం తాను ఆడిషన్ ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే ఆ పాత్రకు తాను ఎంపిక కాలేదని, అంతే తప్ప ఆ అవకాశాన్ని తానే రిజక్ట్ చేయలేదని చెప్పారు. “సీత పాత్రలాంటి అవకాశం వస్తే ఎందుకు తిరస్కరిస్తాను? అది ఏ నటికైనా డ్రీమ్ రోల్. అలాంటి పాత్రకు నేను ‘నో’ చెప్పే ప్రశ్నే లేదు” అని వెల్లడించారు.
ఇటీవల సోషల్ మీడియాలో శ్రీనిధి శెట్టి సీత పాత్రను తిరస్కరించారనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె స్వయంగా స్పందించి వాటికి తెరదించారు. తనపై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, తాను కేవలం ఆడిషన్ మాత్రమే ఇచ్చానని స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘రామాయణ’ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా తెరకెక్కుతోంది.
