
The Paradise: న్యాచురల్ స్టార్ నాని బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యారు. ‘దసరా’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన సరికొత్త చిత్రం ‘ది పారడైజ్’. విడుదలకు ముందే రికార్డు స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్‌తో ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసిన ఈ సినిమా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసే దిశగా దూసుకుపోతోంది. ఇది నాని సినీ కెరీర్‌లోనే ఎన్నడూ చూడని ఆల్‌టైమ్ రికార్డ్ ఓపెనింగ్‌గా నిలవబోతోంది.
1980ల నాటి సికింద్రాబాద్ నేపథ్యాన్ని ఎంచుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, ఈసారి అత్యంత రా అండ్ ఇంటెన్స్ కంటెంట్‌ను తెరపైకి తెచ్చారు. అణచివేతకు గురైన సవారి తెగ హక్కుల కోసం పోరాడే నాయకుడు ‘జడల్’ పాత్రలో నాని ఒదిగిపోయిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. 2 గంటల 49 నిమిషాల నిడివితో వచ్చిన ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు పూర్తిస్థాయి ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం, పాటలు థియేటర్లలో పూనకాలు తెప్పిస్తున్నాయని అభిమానులు సంబరపడుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు కీలక పాత్రలో మెరవగా, హీరోయిన్ కాయాదు లోహర్ తన నటనతో ఆకట్టుకుంది.
