Site icon TeluguMirchi.com

Venky Atluri : సూర్య ’24’కు తమిళ్‌లో రావాల్సిన గుర్తింపు రాలేదు!

Suriya

Venky Atluri : డైరెక్టర్ వెంకీ అట్లూరి తాజాగా తమిళ స్టార్ హీరో సూర్య సినిమాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. సూర్య నటించిన కొన్ని అద్భుతమైన చిత్రాలు థియేటర్లలో విడుదల కాకపోవడం వల్ల వాటికి రావాల్సిన బాక్సాఫీస్ విజయాన్ని కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’ వంటి చిత్రాలు ఓటీటీలో విడుదల కావడం ఆ సినిమాల థియేట్రికల్ సామర్థ్యాన్ని పూర్తిగా చూపించలేకపోయిందని అన్నారు.

ఒక ఇంటర్వ్యూలో వెంకీ అట్లూరి మాట్లాడుతూ.. సూర్య నటించిన ‘సూరరై పొట్రు’, ‘జై భీమ్’ చిత్రాలు నటన, కథ, భావోద్వేగాల పరంగా అసాధారణమైనవని కొనియాడారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా ఈ రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయని, ఒకవేళ ఇవి థియేటర్లలో విడుదలై ఉంటే భారీ బాక్సాఫీస్ సక్సెస్‌లను అందుకునేవని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకుల నుంచి కూడా అపూర్వమైన స్పందన వచ్చేదని చెప్పారు. అంతేకాకుండా సూర్యకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ప్రత్యేక ఆదరణ ఉందని వెంకీ అట్లూరి అన్నారు. తెలుగు ప్రేక్షకులు ఆయనను తమ సొంత హీరోలా ఆదరిస్తారని చెప్పారు. సూర్య నటించిన ’24’ సినిమా తెలుగులో అద్భుతమైన విజయాన్ని సాధించిందని గుర్తుచేశారు. అయితే అంత మంచి సినిమా అయినప్పటికీ తమిళంలో ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వెల్లడించారు. సూర్య నటన, స్టోరీల ఎంపిక ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటాయని, విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుల్లో ఆయన ఒకరని వెంకీ ప్రశంసించారు. ప్రస్తుతం సూర్య హీరోగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాపై ప్రేక్షకులతో పాటు, ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి.

Exit mobile version