
Yash Childhood Story: ‘కేజీఎఫ్’ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా యశ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన సినీ ప్రయాణం, బాల్యం, కుటుంబ పరిస్థితులు, తండ్రి కష్టాలు, కెరీర్‌లో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను చిన్నతనం నుంచే చాలా అల్లరి చేసేవాడినని యశ్ తెలిపారు. తండ్రి ఎంతో కఠినంగా ఉండేవారని, తాను స్కూల్ లేదా కాలేజీకి వెళ్లి 10 నిమిషాలు ఆలస్యమైనా వెంటనే వచ్చి తీసుకెళ్లేవారని గుర్తుచేసుకున్నారు. తన స్నేహితులు కూడా తన తండ్రిని ‘టైగర్’ అని పిలిచేవారని చెప్పారు. తండ్రి తనను క్రమశిక్షణలో పెట్టేందుకు కొట్టేవారని, అయితే ఒకరోజు తాను తండ్రి ముందు కావాలనే పడిపోయి ఆయనకు బాధ కలిగేలా చేశానని యశ్ తెలిపారు. ఆ తర్వాత తన తండ్రి తనను కొట్టడం మానేశారని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు.
తన తండ్రి బస్ డ్రైవర్‌గా పనిచేసేవారని, ఒక సమయంలో ఆయన రోజుకు కేవలం రూ.14 మాత్రమే సంపాదించేవారని యశ్ వెల్లడించారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడూ తనకు తెలియకుండా తన తల్లిదండ్రులు చూసుకున్నారని చెప్పారు. చిన్నతనంలో తమ కుటుంబ పరిస్థితి గురించి తనకు అంతగా అవగాహన లేదన్నారు. కాలేజీకి వెళ్లే సమయంలో ఇతర స్నేహితుల వద్ద ఖరీదైన బైక్‌లు, మంచి దుస్తులు ఉండేవని.. తన వద్ద మాత్రం స్కూటర్ మాత్రమే ఉండేదని యశ్ చెప్పారు. ఆ సమయంలో కొంత ఇన్‌ఫీరియారిటీ ఫీలింగ్ కలిగేదని, అయితే డబ్బు కంటే మనిషి వైఖరి, కష్టపడే తత్వమే గౌరవాన్ని తెచ్చిపెడుతుందని త్వరగానే తెలుసుకున్నానని తెలిపారు. “సొంతంగా కష్టపడి పనిచేయాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. ఎవరి ముందు తలదించుకునే పరిస్థితి రాకూడదు” అని తన తల్లిదండ్రులు నేర్పించారని యశ్ చెప్పారు. వారి వద్ద డబ్బు లేకపోయినా తమ పిల్లలను ఆస్తిగా భావించి పెంచారని, అందుకే తాను వారి పట్ల ఎంతో గర్వంగా ఉంటానని పేర్కొన్నారు.
