
Yash: రాకింగ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’ సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యశ్.. ఇప్పుడు ‘టాక్సిక్’తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. కన్నడ సినీ పరిశ్రమలో రూ.1000 కోట్ల మార్క్ సాధించడం అంత సులభం కాదు. ఇప్పటివరకు ‘కేజీఎఫ్ 2’ మాత్రమే ఈ మైలురాయిని అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి శాండల్‌వుడ్ స్థాయిని మరో మెట్టుకు తీసుకెళ్లింది. గతేడాది విడుదలైన ‘కాంతార: చాప్టర్ 1’ కూడా రూ.1000 కోట్లకు చేరువగా వెళ్లినా.. ఆ మార్క్‌ను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ‘టాక్సిక్’పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ‘కేజీఎఫ్ 2’ తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్‌తో యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీ కూడా ‘కేజీఎఫ్ 2’ స్థాయి వసూళ్లు సాధిస్తుందా? మరోసారి కన్నడ సినిమాను రూ.1000 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్తుందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
అయితే ‘టాక్సిక్’ విషయంలో మరో కీలక అంశం ఉంది. ‘కేజీఎఫ్’ సినిమాలను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. కానీ ‘టాక్సిక్’కు A సర్టిఫికెట్ రావడంతో పిల్లలు సినిమాకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. సినిమాలో హింస, యాక్షన్‌తో పాటు రొమాన్స్ కూడా ఎక్కువగా ఉండటంతో కుటుంబ ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి, తారా సుతారియా వంటి పలువురు ప్రముఖ నటీమణులు కీలక పాత్రల్లో నటించారు. దీంతో యాక్షన్, గ్యాంగ్‌స్టర్ అంశాలతో పాటు గ్లామర్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా మారింది. పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ ‘టాక్సిక్’ను భారీగా విడుదల చేశారు. మరి ‘రాఖీ భాయ్’ ఇమేజ్‌ను దాటి యశ్ కొత్త అవతార్‌లో ఎంతటి ప్రభావం చూపిస్తారు? ‘కేజీఎఫ్ 2’ రికార్డులను తిరగరాసి రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకుంటారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
