
ప్రేక్షకులను నవ్వించడం అనుకున్నంత సులభం కాదని, అందుకు ఎంతో సృజనాత్మకత అవసరమని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI 2026)లో తన దర్శకత్వంలో తెరకెక్కిన చిరంజీవి చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ గురించి ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ఇండియన్ పనోరమా మెయిన్‌స్ట్రీమ్ సినిమా విభాగానికి ఎంపికైన ఐదు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో అనిల్ రావిపూడితో పాటు నిర్మాతలు సాహు గారపాటి, కె. సుస్మిత, నటి కేథరిన్ ట్రెసా పాల్గొన్నారు. హాస్యం అనేది చాలా గంభీరమైన సృజనాత్మక ప్రక్రియ అని, ముఖ్యంగా చిరంజీవి వంటి స్టార్ హీరోతో సినిమా చేసేటప్పుడు అభిమానుల అంచనాలను అందుకోవడంతో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కామెడీని రాయడం సవాలుతో కూడుకున్న విషయమని అనిల్ చెప్పారు. ఏ సన్నివేశం ప్రేక్షకులను నవ్విస్తుందో ముందుగానే అంచనా వేయడం కష్టమని, ఈ విషయంలో తన రచయితల బృందం ఎంతో సహకరించిందని తెలిపారు.
‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంలో చిరంజీవి జాతీయ భద్రతా విభాగంలో పనిచేసే అధికారి పాత్రలో కనిపిస్తారు. విధి నిర్వహణలో బిజీగా ఉండటం వల్ల భార్యాపిల్లలకు దూరమై, కుటుంబానికి విడిగా జీవిస్తుంటారు. ఆరేళ్ల తర్వాత మళ్లీ వారితో కలిసి ఉండాలని భావించి, తన భార్యాపిల్లలు చదువుతున్న పాఠశాలలోనే ఉద్యోగంలో చేరతారు. ఆ తర్వాత కుటుంబానికి దగ్గరవడానికి ఆయన చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే సరదా సంఘటనలతో కథ సాగుతుంది. హాస్యం, యాక్షన్‌తో పాటు కుటుంబ భావోద్వేగాలకు కూడా ఇందులో ప్రాధాన్యత ఇచ్చినట్లు అనిల్ రావిపూడి చెప్పారు. చిన్నప్పటి నుంచి చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనలోని కామెడీ టైమింగ్, నటనా వైవిధ్యం, భావోద్వేగాలను పలికించే ప్రత్యేకతలు తనకు బాగా తెలుసని అన్నారు. ఆ అంశాలను దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేసినట్లు వివరించారు. సంక్రాంతి సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాలు చూడటానికి ఆసక్తి చూపుతారని, అందుకే ఆ పండుగ వాతావరణానికి సరిపోయేలా వినోదాత్మక చిత్రాలను రూపొందించడం తనకు ఇష్టమని చెప్పారు. ప్రేక్షకులు తమ రోజువారీ ఒత్తిళ్లను మరిచిపోయి కాసేపు హాయిగా నవ్వుకోవడం, ఆనందంగా గడపడమే తనకు నిజమైన సంతృప్తినిస్తుందని పేర్కొన్నారు.
