
సినిమాల సంఖ్య పెంచుకోవడం కంటే, ప్రేక్షకుల మనసుల్లో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే ముఖ్యమని భావిస్తున్నాడు యంగ్ హీరో కృష్ణ బూరుగుల. ‘జిగ్రీస్’ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన, తన సహజమైన నటన, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ, ‘జిగ్రీస్’ విడుదల తర్వాతే కృష్ణకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
ఈ సినిమా విజయంతో కృష్ణ బూరుగులకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే వచ్చిన ప్రతి అవకాశాన్ని అంగీకరించకుండా, కథకు ప్రాధాన్యత ఇస్తూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. పది సినిమాలు వరుసగా చేయడం కంటే, ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా నాలుగు మంచి సినిమాలు చేసినా చాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కేవలం తెరపై కనిపించడం కాకుండా, తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించాలన్నదే ఆయన ఆలోచన. ప్రస్తుతం ఇదే పంథాలో తన కెరీర్‌ను ప్లాన్ చేసుకుంటున్నాడు.
ఇక కృష్ణ బూరుగుల తదుపరి ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ విభిన్నమైన కథతో తెరకెక్కనున్న ఎంటర్‌టైనర్ చర్చల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథతో త్వరలోనే ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాడని సమాచారం. వీటితో పాటు మరికొన్ని కథలను కూడా పరిశీలిస్తున్నాడు. ‘జిగ్రీస్’తో వచ్చిన గుర్తింపును నిలబెట్టుకుంటూ, మంచి కథలను ఎంచుకుని నటుడిగా మరింత ఎదగాలని కృష్ణ భావిస్తున్నాడు. ఈ సందర్భంగా యంగ్ హీరో కృష్ణ బూరుగులకు జన్మదిన శుభాకాంక్షలు.
