Site icon TeluguMirchi.com

Aamir Khan: లవ్ జిహాద్ ఆరోపణలపై ఆమిర్ ఖాన్ రియాక్షన్ .. “మా కుటుంబంలో ఎవరూ మతం మార్చుకోలేదు”

AamirKhan

Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌పై గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ‘లవ్ జిహాద్’ ఆరోపణలపై ఆయన తాజాగా స్పందించారు. తన వ్యక్తిగత జీవితం, కుటుంబ నేపథ్యం గురించి వస్తున్న విమర్శలకు సమాధానం ఇస్తూ, తమ కుటుంబం ఎప్పటి నుంచో అన్ని మతాలను గౌరవించే కలుపుగోలు కుటుంబమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ.. తమ కుటుంబంలో వివిధ మతాలకు చెందిన వ్యక్తులతో వివాహాలు జరిగినప్పటికీ, ఎవరూ మతం మార్చుకోలేదని చెప్పారు. “నా ఇద్దరు చెల్లెళ్లు హిందువులను వివాహం చేసుకున్నారు. అలాగే నా కుమార్తె కూడా హిందువునే పెళ్లి చేసుకుంది. నా కజిన్ ఒక క్రిస్టియన్‌ను వివాహం చేసుకున్నారు. అయినప్పటికీ మా కుటుంబంలో ఎవరూ తమ మతాన్ని మార్చుకోలేదు” అని ఆయన వెల్లడించారు.

ఇటీవల తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చల నేపథ్యంలో, తన భాగస్వామి గౌరీ స్ప్రాట్ గురించి కూడా ఆమిర్ వివరణ ఇచ్చారు. “గౌరీ మతం మార్చుకోలేదు. నిజానికి ఆమె హిందువు కూడా కాదు. ఆమె క్రిస్టియన్. అలాగే నా మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావు కూడా ఎప్పుడూ మతం మార్చుకోలేదు” అని ఆయన స్పష్టం చేశారు. మతాంతర వివాహాలను ‘లవ్ జిహాద్’గా చిత్రీకరించడం సరైంది కాదని పరోక్షంగా పేర్కొన్న ఆమిర్ ఖాన్, పరస్పర గౌరవం, వ్యక్తిగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Exit mobile version