
Aishwarya Lekshmi: సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘గార్గి’ (Gargi). కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా, సాయి పల్లవి కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్‌గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ సినిమా కథను తాను మొదట తిరస్కరించినట్లు ఐశ్వర్య లక్ష్మి స్వయంగా వెల్లడించారు. “కోవిడ్‌కు ముందే దర్శకుడు గౌతమ్ రామచంద్రన్ నాకు ‘గార్గి’ కథ చెప్పారు. కానీ అప్పట్లో నేను ఆ కథను రిజెక్ట్ చేశాను. దానికి కారణం.. అంతటి బరువైన పాత్రకు నాకంటే పెద్ద స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితేనే బాగుంటుందని నేను భావించడమే” అని ఐశ్వర్య లక్ష్మి పేర్కొన్నారు. సాయి పల్లవి చేసిన ఆ అద్భుతమైన పాత్రను వదులుకున్నందుకు ఐశ్వర్య లక్ష్మి ఇప్పుడు కాస్త ఎమోషనల్ అయ్యారు. “ఒకవేళ ‘గార్గి’ సినిమా కథ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఉంటే.. కళ్లు మూసుకుని, ఎగిరి గంతేసి చేసేదాన్ని” అని చెప్పుకొచ్చారు.
నటిగా నో చెప్పినప్పటికీ, కథపై ఉన్న నమ్మకంతో ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. “డైరెక్టర్ విజన్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే ఈ సినిమాను కో-ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా భాగస్వామిని అయినందుకు నాకు ఎప్పుడూ గర్వంగానే ఉంటుంది” అని ఆమె చెప్పుకొచ్చారు. సాయి పల్లవి అద్భుత నటనతో మెప్పించిన ‘గార్గి’ చిత్రానికి ఐశ్వర్య లక్ష్మి సమర్పకురాలిగా, సహ నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా, అందులో ఒక చిన్న పాత్రలో కూడా మెరిసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
