Site icon TeluguMirchi.com

Ajay Bhupathi: ‘శ్రీనివాస మంగాపురం’ రిజల్ట్‌కి పూర్తి బాధ్యత నాదే.. మళ్లీ మంచి సినిమాతో వస్తా..

Srinivasa Mangapuram

Ajay Bhupathi: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, స్టార్ హీరో మహేష్ బాబు అన్న కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా వెండి తెరకు పరిచయం అయిన సినిమా శ్రీనివాస మంగాపురం. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రషా థడాని తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందన రాకపోవడంతో తాజాగా ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి సోషల్ మీడియా వేదికగా తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన పోస్ట్‌లో.. ‘శ్రీనివాస మంగాపురం’ తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అని తెలిపారు. ఈ చిత్రం తనకు ఎన్నో భావోద్వేగాలు, మధుర జ్ఞాపకాలను అందించిందని, వాటిని జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నారు. ముఖ్యంగా జయకృష్ణ, రషాలతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని కొత్తవారిగా ఎప్పుడూ భావించలేదని, ఇద్దరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేసేందుకు ఎంతో కష్టపడ్డారని ప్రశంసించారు.

అలాగే ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కిరణ్‌గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. సినిమాకు పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే సినిమా ఫలితానికి సంబంధించి ఎలాంటి సాకులు చెప్పబోనని ఆయన స్పష్టం చేశారు. ‘శ్రీనివాస మంగాపురం’ ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని వెల్లడించారు. ఈ పరాజయం తనను ఆపదని, త్వరలోనే మళ్లీ పుంజుకుని ప్రేక్షకులందరూ మెచ్చే సినిమాతో తిరిగి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది.

Exit mobile version