Site icon TeluguMirchi.com

Ajay Devgn: అజయ్ దేవ్‌గణ్‌కు బీఎంసీ బిగ్ షాక్.. బంగ్లాలో స్పా, సెలూన్ వ్యవహారంపై నోటీసులు!

Ajay Devgn

Ajay Devgn: బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్‌కు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నుంచి ఊహించని షాక్ తగిలింది. ముంబయిలోని అత్యంత సంపన్న ప్రాంతమైన జుహులోని తన నివాస బంగ్లాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో కార్పొరేషన్ అధికారులు ఆయనకు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. అక్కడ జరుగుతున్న నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఈ అంశం ముంబయి వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.

అజయ్ దేవ్‌గణ్‌ తన వ్యక్తిగత బంగ్లాలో వాణిజ్య కార్యకలాపాల కోసం సెలూన్, విలాసవంతమైన స్పాను ఏర్పాటు చేసుకుంటున్నారని, దీనికోసం ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని బీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. స్థానిక హౌసింగ్ సొసైటీ ప్రతినిధుల నుంచి అందిన ఫిర్యాదు ఆధారంగానే తాము ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. నివాస గృహంలో కమర్షియల్ ప్రయోజనాల కోసం పనులు చేయడం ముమ్మాటికీ నిబంధనల ఉల్లంఘనేనని అధికారులు పేర్కొన్నారు.

ఈ వ్యవహారంపై స్పందించిన బీఎంసీ అధికారులు.. ‘‘ఆ నివాస స్థలంలో ఎలాంటి వాణిజ్య ప్రయోజనాల కోసం పనులు చేయడానికి మేం అనుమతులు ఇవ్వలేదు. సొసైటీ నుంచి ఫిర్యాదు అందిన వెంటనే ఆయన నుంచి రాతపూర్వక వివరణ కోరాం. కానీ ఆయన వైపు నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నోటీసులు జారీ చేసి, నిర్మాణాలను ఆపాలని ఆదేశించాం’’ అని స్పష్టం చేశారు. తన ఇష్టారాజ్యంగా నిబంధనలు గాలికొదిలేసి బంగ్లాలో సెలూన్, స్పా నిర్మించడంపై వివాదం ముదరడంతో అజయ్ దేవ్‌గణ్ తదుపరి ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

Exit mobile version