
Ajith Kumar: దాదాపు ఏడాది కాలంగా వెండితెరకు దూరంగా ఉంటూ, అంతర్జాతీయ కార్ రేసింగ్ ట్రాక్‌లపై బిజీగా గడిపిన కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ మళ్లీ ముఖానికి రంగు వేసుకోనున్నారు. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వంటి క్రేజీ సక్సెస్ తర్వాత స్టార్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్, అజిత్ కాంబినేషన్‌లో ప్రకటించిన భారీ ప్రాజెక్ట్ ‘డేర్ డెవిల్’. ఇప్పటివరకూ సైలెంట్‌గా ఉన్న ఈ సినిమా నుంచి దర్శకుడు అధిక్ ఇచ్చిన ఊహించని అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట దుమ్మురేపుతోంది. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కి సంబంధించి అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేస్తూ రెగ్యులర్ షూటింగ్ డేట్‌ను అఫీషియల్‌గా లాక్ చేశారు.
నవంబర్ 2 నుంచి ‘డేర్ డెవిల్’ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా ప్రారంభం కానుంది. “మా సార్ నాకు ముందే ఇచ్చిన పుట్టినరోజు కానుక ఇది.. ఇక పాచికలు వేస్తున్నాం” అంటూ అధిక్ రవిచంద్రన్ పంచుకున్న క్యాప్షన్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. ఈ చిత్రాన్ని అజిత్ సతీమణి షాలినీ అజిత్ కుమార్ స్వయంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండటం ప్రాజెక్ట్‌పై మరింత హైప్‌ను పెంచేసింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో అజిత్‌ను ఊరమాస్ లుక్‌లో ప్రజెంట్ చేసి ఫ్యాన్స్‌కు విందు భోజనం పెట్టిన అధిక్, ఈసారి ‘డేర్ డెవిల్’తో అంతకుమించిన హై-వోల్టేజ్ యాక్షన్‌ను ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. రేసింగ్ గ్యాప్ తర్వాత అజిత్ కెమెరా ముందుకు వస్తుండటంతో నవంబర్ 2 కోసం ఫ్యాన్స్ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.
