Site icon TeluguMirchi.com

Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. నేడు నాంపల్లి కోర్టులో విచారణకు అల్లు అర్జున్

AlluArjun

Allu Arjun: హైదరాబాద్ ఆర్‌టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో కొనసాగుతోంది. ఈ కేసులో నేడు (జులై 29) మరోసారి విచారణ జరగనుండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్‌గా హాజరుకానున్నారు. 2024 డిసెంబర్ 4న ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా అల్లు అర్జున్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు థియేటర్‌కు చేరుకోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు దర్యాప్తు నిర్వహించి దాదాపు 500 పేజీల ఛార్జ్‌షీట్‌ను నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు, థియేటర్ యాజమాన్యాన్ని A1 నుంచి A10 వరకు నిందితులుగా చేర్చగా, అల్లు అర్జున్‌ను A11గా పేర్కొన్నారు. సరైన ముందస్తు సమాచారం, అవసరమైన అనుమతులు లేకుండా థియేటర్‌కు రావడం వల్లే ఈ ఘటన జరిగిందని ఛార్జ్‌షీట్‌లో అభియోగాలు నమోదు చేశారు. ఇటీవల జూన్, జులై నెలల్లో కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. అయితే అల్లు అర్జున్ ముంబైలో సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటంతో, కోర్టు అనుమతితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతున్నారు. ఇటీవల జులై 6న జరిగిన విచారణలో కొందరు నిందితులు వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరుకాకపోవడంతో, తదుపరి విచారణను జులై 29కు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో నేడు జరిగే విచారణపై సినీ, న్యాయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Exit mobile version