
Amitabh Bachchan: భారతీయ సినీ యవనికపై ఎనలేని క్రేజ్ సంపాదించుకున్న లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ అనూహ్య ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ సెట్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనతో బిగ్ బీ అభిమానులు, సినీ వర్గాలు తీవ్ర ఆందోళనకు లోనయ్యాయి. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న పాపులర్ టెలివిజన్ రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 18’ చిత్రీకరణ వేళ ఈ ప్రమాదం జరిగింది. సెట్‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారడంతో అమితాబ్ కిందపడిపోయారు. ఈ హఠాత్ పరిణామంలో ఆయన ఎడమ మోకాలికి బలమైన దెబ్బ తగిలింది. షో చరిత్రలోనే తొలిసారిగా ఆయన ఎంట్రీ విధానం మారడం ప్రేక్షకులను ఉలిక్కిపడేలా చేసింది. సాధారణంగా ప్రతీ ఎపిసోడ్ ఆరంభంలో వేదిక మధ్యలోకి దర్జాగా నడిచొచ్చి, నిలబడి తన గంభీరమైన కంఠంతో ప్రేక్షకులను పలకరించే అమితాబ్.. ఈసారి నేరుగా కుర్చీలో కూర్చునే కనిపించారు.
ఈ మార్పుతో కంగారుపడ్డ ఆడియన్స్‌కు తానే స్వయంగా అసలు విషయాన్ని బయటపెట్టారు బిగ్ బీ. కాలు జారి కిందపడటం వల్ల ఎడమ మోకాలికి గాయమైందని, ఎక్కువసేపు నిలబడటం కష్టంగా మారడంతోనే కూర్చొని షో నడిపించాల్సి వస్తోందని వివరించారు. అయితే ఇది చాలా పెద్ద గాయం కాదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆటలో పాల్గొనే కంటెస్టెంట్లను స్టేజ్ మీదికి ఆహ్వానించే సమయంలో మాత్రం నొప్పిని భరిస్తూనే నిలబడి వారికి గౌరవం ఇస్తానని చెప్పడంతో ప్రేక్షకులంతా ఊపిరి పీల్చుకున్నారు. 83 ఏళ్ల పండు వయసులోనూ ఏమాత్రం అలసట లేకుండా యంగ్ హీరోలకు పోటీగా నిరంతరం ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు అమితాబ్.
ప్రస్తుతం రిభు దాస్‌గుప్తా దర్శకత్వంలో ‘సెక్షన్ 84’ అనే కోర్ట్‌రూమ్ డ్రామాలో నటిస్తున్నారు. మరోవైపు పాన్-వరల్డ్ హిట్ ‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్‌లో ప్రభాస్, కమల్ హాసన్‌లతో కలిసి ‘అశ్వత్థామ’గా మరోసారి వీరవిహారం చేయడానికి సన్నద్ధమవుతున్నారు. అలాగే ‘ఆంఖేన్ 2’ ప్రాజెక్ట్ కూడా ఆయన లైనప్‌లో ఉంది. ఇలా వరుస షూటింగ్‌లతో రెస్ట్ లేకుండా గడుపుతున్న బిగ్ బీకి ఇలాంటి గాయం కావడం ఫ్యాన్స్‌ను కలవరపెట్టినా, ఆయన చూపించిన అంకితభావం, దృఢసంకల్పం మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. అభిమానులు, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
