Site icon TeluguMirchi.com

Anil Ravipudi: అనిల్‌ రావిపూడి నుంచి ఊహించని సినిమా.. రామాయణంతో కొత్త ప్రయాణం!

Anil Ravipudi

Anil Ravipudi: హిట్‌మిషన్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి కొత్త తరహా ప్రయోగానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తొలిసారి యానిమేషన్‌ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారట. రామాయణం నేపథ్యంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ నిర్మించనున్నట్లు సమాచారం. రామాయణంలోని కీలక ఘట్టాలను ఒకే యానిమేషన్‌ చిత్రంగా రూపొందించేలా ఈ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ కథ కోసం అనిల్‌ రావిపూడి ఇప్పటికే విస్తృతంగా పరిశోధన చేసినట్లు టాక్. అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఆయన అనుసరిస్తున్న విధానం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సాధారణంగా డైరెక్టర్స్ ముందుగా స్క్రిప్ట్‌, డైలాగులు రెడీ చేసి.. వాటి ఆధారంగా నటీనటులతో సన్నివేశాలను తెరకెక్కిస్తారు. కానీ అనిల్‌ రావిపూడి మాత్రం తన యానిమేషన్‌ మూవీ కోసం ప్రతి సన్నివేశాన్ని స్వయంగా నటించి రికార్డ్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆయా సన్నివేశాల్లో పాత్రలు పలకాల్సిన డైలాగులతో పాటు వారి హావభావాలు, ఎమోషన్స్‌, బాడీ లాంగ్వేజ్‌ను కూడా ఆయన స్వయంగా ప్రదర్శించి విజువల్‌ రిఫరెన్స్‌గా రికార్డ్‌ చేసినట్లు సమాచారం. ఈ రికార్డింగ్స్‌ను ఆధారంగా చేసుకుని యానిమేటర్లు పాత్రల కదలికలు, భావోద్వేగాలు, సన్నివేశాలను డిజైన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అనిల్‌ రావిపూడి మార్క్‌ టేకింగ్‌ యానిమేషన్‌లోనూ కనిపించే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పురాణ కథలతో ఓ సినిమా చేయాలనే కోరిక తనకు ఎప్పటి నుంచో ఉందని గతంలో అనిల్‌ రావిపూడి పలుమార్లు చెప్పారు. ఇప్పుడు రామాయణం ఆధారంగా యానిమేషన్‌ చిత్రంతో ఆ కలను నెరవేర్చుకునే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Exit mobile version