
The Pet Detective : ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన జీ5 ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా మరొక ఆసక్తికరమైన డిజిటల్ ప్రీమియర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. అదే ‘ది పెట్ డిటెక్టివ్’. నవంబర్ 28 నుంచి ఈ చిత్రం జీ5లో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రణీష్ విజయన్ ఈ చిత్రాన్ని రూపొందించగా, ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించటంతో పాటు నిర్మాతగా కూడా తొలి అడుగు వేశారు. వినాయకన్, వినయ్ ఫార్ట్, అనుపమ పరమేశ్వరన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ ముఖ్య పాత్రల్లో నటించారు.
కథ విషయానికి వస్తే, జోస్ అలులా (ష్రాఫ్ యు దీన్) ఓ డిటెక్టివ్. అతనికి చెప్పుకోదగ్గక కేసులుండవు. అయితే తనను తాను నిరూపించుకోవాలని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో కనిపించకుండా పోయిన ఓ పెంపుడు జంతువు కేసుని సాల్వ్ చేయటానికి ఒప్పుకుంటాడు. ఈ కేసుని శోధించే క్రమంలో ఏర్పడ్డ గందర గోళ పరిస్థితుల్లో ఇంటర్నేషనల్ స్మగ్లర్స్, కిడ్నాపర్స్, కనిపించకుండా పోయిన ఓ చిన్నారి, మెక్సికన్ మాఫియా డాన్, అరుదైన చేప, కనిపించకుండా పోయిన అమ్మాయిని వెతికే పోలీస్ ఇన్సెపెక్టర్ అందరూ ఈ కథలోకి ఎంట్రీ ఇస్తారు.
కథలోని వినోదం, విచిత్రమైన పాత్రలు, ఊహించని ట్విస్టులు, ప్రియదర్శన్ శైలిని గుర్తు చేసే హై వోల్టేజ్ కామెడీ క్లైమాక్స్.. ఇవన్నీ కలిపి ‘ది పెట్ డిటెక్టివ్’ చిత్రం ఫ్యామిలీ ఆడియెన్స్, కామెడీ మూవీ లవర్స్ సహా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత ష్రాఫ్ యు దీన్ మాట్లాడుతూ.. “ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఇదే నా తొలి చిత్రం. ప్రేక్షకులు ఏ ఆలోచన లేకుండా సరదాగా నవ్వుకునేలా సినిమా చేయాలని అనుకున్నాం. మలయాళంలో వస్తున్న స్పందన చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులు చూడబోతుండటంతో మరింత ఆనందంగా ఉంది” అని చెప్పారు. నవంబర్ 28 నుంచి ‘ది పెట్ డిటెక్టివ్’ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
